ఓఆర్ఆర్ నిర్వహణ బిడ్లు పూర్తిగా పారదర్శకం : స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్
ఓఆర్ఆర్ టోల్ పాలసీని 2012లోనే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ చెప్పారు.

హైదరాబాద్ చుట్టూ నిర్మించిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను ఇటీవలే 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ పిలిచిన బిడ్లలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.7,380 కోట్లకు నిర్వహణ హక్కులు దక్కించుకున్నది. టోల్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్దతిలో ఈ లీజును ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. ఈ మొత్తం బిడ్డింగ్ వ్యవహారం పూర్తి పారదర్శకతతో నిర్వహించామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ టోల్ పాలసీని 2012లోనే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసిందని ఆయన చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ఫీ రూల్స్ 2008ని అనుసరించి ఈ పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. టోల్ ఎలా వసూలు చేయాలి, ప్రతీ ఏడాది ఎంత మేరకు పెంచాలనే విషయాలు ఈ పాలసీలో నిబంధనలకు అనుగుణంగా రూపొందించామన్నారు.
ఓఆర్ఆర్ నిర్వహణకు హెచ్ఎండీఏ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 30 ఏళ్ల లీజు కోసం నవంబర్ 22న బిడ్లు ఆహ్వానించగా.. 2023 మార్చి 31 వరకు గడువు విధించామని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తం 11 మంది బిడ్డింగ్‌లో పాల్గొన్నారని.. నాలుగు దశల్లో వడపోసిన తర్వాత ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాను ఎంపిక చేసినట్లు అరవింద్ కుమార్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తిగా పారదర్శకంగా జరిగినట్లు ఆయన చెప్పారు. దేశంలోనే అతిపెద్ద అస్సెట్ మానిటైజేషన్ డీల్స్‌లో ఓఆర్ఓర్ ఒకటని అరవింద్ కుమార్ వెల్లడించారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేదని ఆయన పేర్కొన్నారు.