హైదరాబాద్‌లో వార్నర్ బ్రదర్స్ కార్యాలయం ప్రారంభం.. 1,200 మందికి ఉద్యోగాలు
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కార్యాలయం ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరంలోని ఐటీ రంగానికే కాకుండా మీడియా, వినోద రంగానికి మేలు జరుగనున్నది.
హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, టెలివిజన్, మూవీ, స్ట్రీమింగ్, గేమింగ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం కాపిటాల్యాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ టవర్‌లో విశాలమైన ఆఫీసును ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ భారతీయ మార్కెట్‌లో అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం కలిగింది.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కార్యాలయం ఏర్పాటు వల్ల హైదరాబాద్ నగరంలోని ఐటీ రంగానికే కాకుండా మీడియా, వినోద రంగానికి మేలు జరుగనున్నది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యాలయంలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని.. వారందరూ ఒకే సారి పని చేసుకునేలా విశాలమైన, ఆహ్లాదకరమైన ఆఫీసును ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ ఏడాది మే నెలలో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. అప్పుడే న్యూయార్క్‌లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు ఎలా అనుకూలంగా ఉన్నది, వినోద రంగంలో హైదరాబాద్ ఎలా ఎదుగుతున్నదో వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పారదర్శకంగా, వేగంగా లభిస్తాయని కూడా చెప్పారు. కేటీఆర్ అభ్యర్థనతో అప్పుడే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందం మేరకు కేవలం మూడు నెలల్లోనే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తమ ఐడీసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.