నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సచివాలయంలో ప్రార్థనాలయాల ప్రారంభం.. గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం
సచివాలయంలో నైరుతి మూలన నల్లపోచమ్మ ఆలయాన్ని విశాలంగా నిర్మించారు. ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, మహామండపం నిర్మించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్మించిన ప్రార్థనాలయాలను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసైని ఆహ్వానించగా.. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సచివాలయం ప్రాంగణంలో పునర్నిర్మించిన ప్రార్థనా మందిరాలను ఈ రోజు మంచి ముహూర్తం ఉండటంతో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సచివాలయంలో నైరుతి మూలన నల్లపోచమ్మ ఆలయాన్ని విశాలంగా నిర్మించారు. ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, మహామండపం నిర్మించారు. నల్లపోచమ్మ ఆలయంతో పాటు శివాలయం. ఆంజనేయస్వామి ఆలయం, గణపతి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కూడా నిర్మించారు. రెండు రోజుల క్రితమే రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ప్రారంభించారు. తొలి రోజు సతీసమేతంగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రోజు నల్లపోచమ్మ ఆలయం పునఃప్రారంభంతో పాటు కొత్తగా నిర్మించిన రెండు మసీదులు, చర్చిని కూడా కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ప్రార్థనలు నిర్వహిస్తారు.
నూతన గుడి, చర్చి, మసీదుల ప్రారంభం సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను, మతాలను గౌరవిస్తారని.. అందుకే సచివాలయ ప్రాంగణంలో మూడు మతాల ప్రార్థనాలయాల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి ఈశ్వర్ ప్రశంసించారు.
♦