Telugu Global
Telangana

మరో ఆరు రోజులు మాత్రమే మిగిలున్నాయి

కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. సీటు కన్ఫామ్‌ చేసుకున్న నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మిగిలిన స్థానాల్లో ఆశావహులకు ఎదురుచూపులు తప్పట్లేదు.

మరో ఆరు రోజులు మాత్రమే మిగిలున్నాయి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 10 వరకు మాత్రమే గడువు. అంటే మరో ఆరు రోజులు మాత్రమే మిగిలిఉంది. అయితే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. సీటు కన్ఫామ్‌ చేసుకున్న నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మిగిలిన స్థానాల్లో ఆశావహులకు ఎదురుచూపులు తప్పట్లేదు.

అధికార బీఆర్ఎస్ పార్టీ మొదటి విడతలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తర్వాత జనగాం, నర్సాపూర్‌ స్థానాల్లోనూ అభ్యర్థులను ఫైనల్ చేసింది. దాదాపు అభ్యర్థులందరికీ బీఫామ్‌లు సైతం ఇచ్చింది. గోషామహల్‌లో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక అలంపూర్‌ టికెట్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

రెండు విడతల్లో దాదాపు 100 మంది అభ్యర్థులను ఖరారు చేసిన హస్తం పార్టీ.. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాల్సి ఉంది. ఆయా స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటం హస్తం పార్టీకి ఇబ్బందిగా మారింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇక బీజేపీ ఇప్పటివరకూ మూడు విడతల్లో 88 అభ్యర్థులను ఫైనల్ చేసింది. మొదటి విడతలో 52, రెండో విడతలో ఒక అభ్యర్థిని ఖరారు చేసింది. 35 మందితో మూడో జాబితా రిలీజ్ చేసింది. మరో 31 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. జనసేనతో పొత్తు అంశం, పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మిగిలిన స్థానాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది.

అయితే నామినేషన్ల స్వీక‌ర‌ణ‌కు మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉండ‌టంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. మిగిలిన రోజుల్లో మంచి రోజులు చూసుకుని నామినేషన్ వేయాలని వారంతా భావిస్తున్నారు. దీంతో పార్టీలన్ని అభ్యర్థులను త్వరగా ఫైనల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  4 Nov 2023 11:18 AM IST
Next Story