Telugu Global
Telangana

టిక్కెట్టే ఇవ్వని బీజేపీ.. బీసీని సీఎం చేస్తుందా..?

బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఎండగట్టారు తుల ఉమ. బలహీనవర్గాలకు చేయూతనందిస్తామని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

టిక్కెట్టే ఇవ్వని బీజేపీ.. బీసీని సీఎం చేస్తుందా..?
X

బీజేపీ బీసీ సీఎం అనే ప్రచారానికి ఆ పార్టీ నుంచే గట్టి కౌంటర్ పడింది. తాజాగా వేములవాడ టికెట్ విషయంలో బీసీలపై బీజేపీకి ఎంత ప్రేమ ఉందనే విషయం బయటపడింది. బీసీ మహిళ అయిన తనకు టికెట్ ప్రకటించి, చివరి నిమిషంలో బీ ఫామ్ వేరొకరికి ఇవ్వడం ద్రోహం కాదా అని ప్రశ్నించారామె. ఆరు నూరైనా పోటీలో తాను నిలబడతానని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా వేములవాడ బరిలో ఉంటానని తేల్చి చెప్పారు తుల ఉమ.

ఈటల రాజేందర్ సిఫారసుతో వేముల వాడ బీజేపీ టికెట్, తుల ఉమకు ఖాయమైంది. జాబితాలో కూడా ఆమె పేరే ఉంది. అయితే ఆ తర్వాత రాజకీయ ఒత్తిడులతో చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకి బీ ఫామ్ ఇచ్చింది అధిష్టానం. దీంతో ఉమ వర్గం రగిలిపోతోంది. ఈటల రాజేందర్ కు తలకొట్టేసినట్టయింది. ఈ అవమానం తట్టుకోలేమని, బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్నారు ఉమ వర్గం నేతలు. బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఎండగట్టారు తుల ఉమ. బలహీనవర్గాలకు చేయూతనందిస్తామని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.

బడుగు, బలహీనవర్గాల ప్రజల కోసం విప్లవోద్యమంలో పని చేయడం, తెలంగాణ ఉద్యమంలో పని చేయడమే తాను చేసిన నేరమా..? అని ప్రశ్నిస్తున్నారు తుల ఉమ. బానిసత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం కొట్లాడానని, విప్లవోద్యమంలో హత్యలకు పాల్పడినట్టు తనపై ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తున్నట్టు చెప్పుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు కేవలం వ్యక్తుల కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోబోనని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు తుల ఉమ.

First Published:  11 Nov 2023 6:54 AM IST
Next Story