Telugu Global
Telangana

సీఎం కేసీఆర్‌లా కలలు కనే ధైర్యం, అది సాధించే పట్టుదల ఉండాలి : మంత్రి కేటీఆర్

దేశానికే ఆదర్శంగా నిలవనున్న డబుల్ బెడ్రూం డిగ్నిటీ హౌసింగ్ కమ్యూనిటీ (ఆత్మ గౌరవ సౌధాలు) తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.

సీఎం కేసీఆర్‌లా కలలు కనే ధైర్యం, అది సాధించే పట్టుదల ఉండాలి : మంత్రి కేటీఆర్
X

కలలు కనడానికి ధైర్యం, అది సాధించడానికి పట్టుదల ఉండాలనేదే సీఎం కేసీఆర్ విజయ సూత్రం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే కలను ధైర్యంగా కనడమే కాకుండా.. దాన్ని సాధించారు. ఇక స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేదలకు సొంత ఇంటి కలను నిజం చేయాలని డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా విజయవంతంగా కొనసాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం సామూహిక గృహ సముదాయాన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ దాని విశేషాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు.

దేశానికే ఆదర్శంగా నిలవనున్న డబుల్ బెడ్రూం డిగ్నిటీ హౌసింగ్ కమ్యూనిటీ (ఆత్మ గౌరవ సౌధాలు) తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.1,354.59 కోట్లతో ఈ హౌసింగ్ కమ్యూనిటీని నిర్మించారు. ఎస్+9, ఎస్+11, ఎస్+10 అంతస్తులతో మొత్తం 15,600 ఇళ్లను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించారు. మొత్తం 145 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గృహ సముదాయంలో 117 బ్లాకులు, 234 ఎలివేటర్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సైజు 560 చదరపు అడుగులుగా ఉన్నది.

అంతర్గత రోడ్లు, స్మార్ట్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్, మంచి నీటి సరఫరా, అంతర్గత డ్రెయిన్లు ఏర్పాటు చేశారు. కమర్షియల్ కాంప్లెక్సులు, కమ్యూనిటీ కాంప్లెక్స్, అంగన్‌వాడీ, పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక బస్టాప్‌తో పాటు ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ గృహ సముదాయానికి 9 ఎంఎల్‌డీల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉన్నది. ఇక్కడ నివసించే వారికి ఇబ్బంది లేకుండా.. అన్ని రకాలైన వసతులను కల్పించారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ.7.90 లక్షల వ్యయం అయ్యింది. మరో రూ.75 వేలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ డిగ్నిటీ హౌసింగ్‌ను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.


First Published:  21 Jun 2023 8:34 AM IST
Next Story