Telugu Global
Telangana

వరుడు ఒక్కడే.. వధువులు ఇద్దరు

పెళ్లి కార్డ్ లో వరుడు, వధువు, సుముహూర్తం అనే కాలమ్స్ ఉంటాయి. అయితే ఈ పెళ్లి కార్డ్ లో మాత్రం వరుడు తర్వాత వధువు-1, వధువు-2 అని చదువుకోవాల్సి ఉంటుంది.

వరుడు ఒక్కడే.. వధువులు ఇద్దరు
X

ఒకే పందిరిలో రెండు పెళ్లిళ్లు, ఒకే మహూర్తానికి రెండు పెళ్లిళ్లు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా..? ఆ రెండు పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు ఒకడే. అవును, ఒకడే పెళ్లికొడుకు, ఇద్దరు పెళ్లి కూతుళ్లు. ఆ ఇద్దరి మెడలో తాళి కట్టేది ఒక్కడేనన్నమాట. ఆ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ మొదలయ్యే పెళ్లి కార్డ్ లో వరుడు, వధువు, సుముహూర్తం అనే కాలమ్స్ ఉంటాయి. అయితే ఈ పెళ్లి కార్డ్ లో మాత్రం వరుడు తర్వాత వధువు-1, వధువు-2 అని చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే వరుడుకి ఇద్దరు వధువులు ఆ వివాహం స్పెషాలిటీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు. వ్యవసాయ కూలీ అయిన సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోసిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సునీత, సత్తిబాబును నిలదీసింది. దీంతో సత్తిబాబు డైలమాలో పడ్డాడు. కొన్నాళ్లపాటు ఆ ప్రస్తావన ఆగిపోయింది.

ఆ తర్వాత అసలు కథ మొదలైంది. పెళ్లి చేసుకోకుండా ఏడాదిగా సత్తిబాబు స్వప్న, సునీతతో విడివిడిగా కాపురం ప్రారంభించాడు. భార్యలిద్దరికీ పిల్లలు పుట్టారు. కోయ గిరిజనుల తెగలలో పెళ్లి కాకుండానే కాపురం, ఆ తర్వాత పెళ్లి సహజమే. కానీ ఇప్పుడు వారిద్దర్నీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు సత్తిబాబు. ముందు కాపురం చేసి పిల్లలను కన్న సత్తిబాబు ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే గుట్టుచప్పుడుగా కాకుండా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకోవడం విశేషం. అందుకే పెళ్లి కార్డులు కూడా కొట్టించాడు. చిరంజీవి సత్తిబాబుకి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి-1 స్వప్న, చిలసౌ-2 సునీతతో పెళ్లి నిశ్చయించారని పెళ్లి కార్డులు రెడీ చేశారు. శుభలేఖలో వరుడి పేరు, ఇద్దరు వధువుల పేర్ల ఉండటంతో అంతా షాక్ అయ్యారు. ఈనెల 9న ఈ విచిత్ర వివాహం జరగబోతోంది.

First Published:  8 March 2023 11:12 AM IST
Next Story