ఇంటికి రెండు టికెట్లు.. కాంగ్రెస్‌లో కొత్త లొల్లి
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు. హుజూర్‌నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ప్రకటించేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, అభ్యర్థులు ప్రచారం షురూ చేసేసినా.. కాంగ్రెస్‌లో టికెట్ల కసరత్తు ఓ కొలిక్కి కూడా రాలేదు. ఎక్కడికక్కడ టికెట్ల డిమాండ్లు, బీఆర్ఎస్‌లో అసంతృప్తులు వస్తారేమోనన్న ఎదురుచూపులు మధ్య టికెట్ల పంచాయితీ ఏకాడికీ తెగట్లేదు. మరోవైపు ఇంటికి రెండు టికెట్ల డిమాండ్ కాంగ్రెస్‌లో కొత్త లొల్లిగా మారింది.
నాకు, మా ఆమెకు రెండు టికెట్లు కావాలంటున్న ఉత్తమ్
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు. హుజూర్‌నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ప్రకటించేశారు. అప్లికేషన్లు పెట్టుడు జాన్తానై అని తేల్చేశారు. అయితే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని సోనియాగాంధీ ప్రకటించేశారని, ఇంటికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అయితే కోమటిరెడ్డి సోదరులు వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్లు సోదరులు భట్టి విక్రమార్క, రవి, జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ యాదవ్ ఇలా ఇంటికి రెండు టికెట్లు అడుగుతున్న నేతల జాబితా పెద్దగానే కనిపిస్తోంది.
కొత్తగా వచ్చేవాళ్లకు హామీలిస్తున్నారా..?
మరోవైపు బీఆర్ఎస్ అసంతృప్తులు పార్టీలోకి వస్తుంటే వారికి రెండు టికెట్లకు హామీ ఇస్తున్నారన్న మాట కాంగ్రెస్ సీనియర్లలో మరింత మంట పుట్టిస్తోంది. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరబోతున్న రేఖానాయక్ తనకు ఖానాపూర్ టికెట్, ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న భర్త శ్యామ్‌నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ ఖాయమైందని చెబుతున్నారు. దీనికి రేవంత్‌రెడ్డి అంగీకరించారన్నది వారి మాట. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి హన్మంతరావును కాంగ్రెస్‌లోకి తెచ్చుకుందామన్నా ఇదే లొల్లి. మైనంపల్లి తనకు మల్కాజిగిరి, తన కుమారుడు మెదక్ కావాలని రాయబారాలు పంపుతున్నారు. అసలు ఆ రెండో టికెట్ కోసం బీఆర్ఎస్ అగ్రనేతలతో లొల్లి పెట్టుకున్నానని ఆయన గుర్తుచేస్తున్నారు. ఈ లెక్కన ఈ రెండేసి టికెట్ల పంచాయితీ కాంగ్రెస్‌లో ఎప్పటికి తీరుతుందో!
*