హైదరాబాద్ లో కాల్పులు.. రియల్టర్ మృతి
హైదరాబాద్ మాదాపూర్ లో సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇస్మాయిల్ అనే రియల్టర్ మరణించాడు. మరొకరు గాయపడ్డారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ మాదాపూర్ లో సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇస్మాయిల్ అనే రియల్టర్ మరణించాడు. మరొకరు గాయపడ్డారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.
జిలానీ, మహ్మద్,జహంగీర్, ఇస్మాయిల్ స్నేహితులని, అంతా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. అయితే భూ వివాదాన్ని పరిష్కరించుకుందామని చెప్పి ఇస్మాయిల్ ని జిలానీ, మహ్మద్ మాదాపూర్ వద్దకు రావాలని కోరినట్టు వెల్లడైంది.
ఇస్మాయిల్, జహంగీర్ రాగానే వారు కారులో ఉండగా... ఇస్మాయిల్ పై మహ్మద్ కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. కాల్పులు జరిపిన వెంటనే మహ్మద్, జిలానీ పారిపోయారు. లోగడ ఇస్మాయిల్, జిలానీ స్నేహితులని, ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారని తెలిసింది. కానీ ఈ వ్యాపారంలో ఇద్దరి మధ్యా గొడవలు తలెత్తాయి. . కాల్పుల ఘటనలో గాయపడిన జహంగీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.