Telugu Global
Telangana

ఓటర్లలో కోటి మంది రైతులే.. ఏ పార్టీ వైపు..?

గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, సాగుకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించామని బీఆర్ఎస్ చేప్తోంది. ఈ సారి భూమి లేని కుటుంబాలకు సైతం రైతుబీమా అమలు చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇస్తోంది.

ఓటర్లలో కోటి మంది రైతులే.. ఏ పార్టీ వైపు..?
X

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కాగా, తెలంగాణలో అతిపెద్ద ఓటుబ్యాంకు రైతులదే. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో మూడింట ఒకవంతు రైతులే ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 75 లక్షల మంది భూ యజమానులతో పాటు.. 25 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. దీంతో రైతులను తమవైపు తిప్పుకునేందుకు అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, సాగుకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించామని బీఆర్ఎస్ చేప్తోంది. ఈ సారి భూమి లేని కుటుంబాలకు సైతం రైతుబీమా అమలు చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇస్తోంది.

ఇక కమలనాథులు పీఎం కిసాన్ యోజన పథకంతో పాటు కేంద్రం అందిస్తున్న ఎరువుల సబ్సిడీపై ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌ మోడల్‌ను ప్రస్తావిస్తోంది. రైతులకు రైతుబంధు తరహాలో ఏటా ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, కూలీలకు రూ.12 వేల ఆర్థికసాయం లాంటి హామీలను మేనిఫెస్టోలో ఉంచింది కాంగ్రెస్‌. ఒకేవిడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.

వీటితో పాటు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, పంటల బీమా పథకం, వరికి రూ.500 బోనస్ అంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఇక బీజేపీ రైతులకు ఎకరాకు రూ.18 వేల పెట్టుబడి సాయం, చిన్న, సన్నకారు రైతులకు రూ.2500 విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు హామీ ఇచ్చింది. పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు పంట బీమా, వరికి రూ.3100 మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు సహా మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని బీజేపీ చెబుతోంది.

2018 ఎన్నికల్లో రుణమాఫీ, రైతుబంధు అమలు బీఆర్‌ఎస్‌కు మేలు చేసింది. ఈసారి బీఆర్ఎస్‌, బీజేపీ రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించలేదు. రైతుబంధు సాయాన్ని దశలవారీగా ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామని బీఆర్ఎస్‌ హామీ ఇచ్చింది. ఈ పథకంలో కౌలురైతులను ప్రస్తావించలేదు. వీటితో పాటు ధరణి పోర్టల్‌ స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని కాంగ్రెస్‌ హామీ ఇవ్వగా.. మీ భూమి పోర్టల్ తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

First Published:  23 Nov 2023 2:53 AM GMT
Next Story