Telugu Global
Telangana

ఒకప్పుడు కూలీలు.. ఇవ్వాళ యజమానులు.. దళిత బంధు గొప్పతనం ఇది : మంత్రి కేటీఆర్

దళిత బంధు పథకం గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇటీవలే దళిత బంధ పథకం ద్వారా ముగ్గురు లబ్ధిదారులు కలిసి రైస్ మిల్లు పెట్టుకున్నారు. ఆ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఒకప్పుడు కూలీలు.. ఇవ్వాళ యజమానులు.. దళిత బంధు గొప్పతనం ఇది : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం సత్ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు కూలీలుగా, కార్మికులుగా, డ్రైవర్లుగా పని చేసిన వాళ్లు.. ఈ పథకాన్ని ఉపయోగించుకొని యజమానులుగా మారుతున్నారు. కేవలం తాము ఎదగడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన దళిత బంధు పథకం గొప్పతనాన్ని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇటీవలే దళిత బంధు పథకం ద్వారా ముగ్గురు లబ్ధిదారులు కలిసి రైస్ మిల్లు పెట్టుకున్నారు. ఆ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తాజాగా ఇద్దరు దళిత బంధు లబ్ధిదారులు కోళ్ళ ఫామ్ ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఇవ్వాళ ఆ యూనిట్‌ను ప్రారంభించనున్నారు.

'దళిత బంధు పథకం సాధించిన మరో విజయం ఇది. చెదల దుర్గయ్య, సుమన్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకప్పుడు కోళ్ల ఫామ్‌లో కూలీలుగా పని చేశారు. కానీ ఇప్పుడు దళిత బంధు పథకాన్ని ఉపయోగించుకొని కోళ్ల ఫామ్‌కు యజమానులు అయ్యారు. సిరిసిల్ల జిల్లా గండి లచ్చపేట్‌లో ఏర్పాటు చేసిన ఈ ఫామ్‌ను నేడు తాను ఓపెన్ చేయబోతున్నాను' అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్‌ను కూడా మంత్రి అభినందించారు. ఇక ఫామ్ ప్రారంభించిన అనంతరం అక్కడే లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.

సిరిసిల్లలో మంత్రి పర్యటన..

మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరరావు మండలాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. చీర్లవంచ గ్రామంలో రూ.19.50 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ భవనం, రూ.5 లక్షలతో చేపట్టనున్నముదిరాజ్ సంఘ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.1.50 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లక్ష్మీపూర్ పల్లె దవాఖానను ప్రారంభిస్తారు. పాపయ్యపల్లెలో రూ.26 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. తంగళ్లపల్లె పీహెచ్‌సీలో ఫిజియోథెరపి సేవలు ప్రారంభిస్తారు.


First Published:  10 April 2023 4:31 AM GMT
Next Story