Telugu Global
Telangana

రైతులకు 3 గంటల కరెంటు చాలు.. మరోసారి రేవంత్ కామెంట్స్‌

తెలంగాణ రాష్ట్రంలోని 58 లక్షల కమతాల్లో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారని చెప్పారు. ఈ లెక్కన మూడు, నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేశారు రేవంత్.

రైతులకు 3 గంటల కరెంటు చాలు.. మరోసారి రేవంత్ కామెంట్స్‌
X

రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం ఓ ఛానల్‌ నిర్వహించిన రేవంత్‌ రెడ్డితో క్వశ్చన్‌ అవర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమెరికా పర్యటనలో భాగంగా రైతులకు మూడు గంటల కరెంటు చాలంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇప్పటికి తాను అదే మాటకు కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.

తనకు వ్యవసాయం తెలుసని, తాను వ్యవసాయం చేశానన్నారు రేవంత్ రెడ్డి. 10 HP మోటార్‌తో ఎకరాకు నీళ్లు పారాలంటే గంట సమయం పడుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని 58 లక్షల కమతాల్లో 95 శాతం మంది రైతులు 3 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారని చెప్పారు. ఈ లెక్కన మూడు, నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుందని కామెంట్స్ చేశారు రేవంత్. కరెంటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటలు ఇస్తామని.. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో చెప్తున్నామన్నారు రేవంత్. కేసీఆర్ 24 గంటల విద్యుత్ ఇచ్చినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేశారు.


జూలైలో అమెరికా పర్యటనకు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సైతం మండిపడింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ప్రచారంలో భాగంగా కరెంటు విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీఆర్ఎస్‌. తాజాగా మరోసారి విద్యుత్‌పై అలాంటి కామెంట్స్ చేశారు రేవంత్‌. రైతుబంధు విషయంలోనూ రేవంత్ ఇటీవల చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమయ్యాయి.

First Published:  11 Nov 2023 8:46 AM IST
Next Story