Telugu Global
Telangana

ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణ ప్రభుత్వంపై ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే గవర్నర్ తమిళిసై మళ్ళీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చెన్నైలో జరిగి ఓ కార్యక్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకపడ్డారు.

ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
X

తెలంగాణ ప్ర‌భుత్వం పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడూ ఎవ‌రినీ అడ్డుకోక‌పోయిన‌ప్ప‌టికీ అక్క‌డ అధికారంలో ఉన్న‌వారు మాత్రం తాను చేసే ప్ర‌తిదానిని అడ్డంకిగా భావిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా త‌న మూడేళ్ళ అనుభ‌వాల‌ను క్రోడీక‌రిస్తూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై రాసిన 'రి-డిస్కవరింగ్ సెల్ఫ్ ఇన్ సెల్ఫ్ లెస్ స‌ర్వీస్ ' అనే పుస్తకాన్ని గురువారంనాడు ఆమె చెన్నైలో ఆవిష్క‌రించారు. ఆమె ప్ర‌స్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అద‌న‌పు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ, "తెలంగాణలో నేను ఎప్పుడూ దేనినీ అడ్డుకోలేదు. కానీ అక్కడ అధికారంలో ఉన్నవారు నేను చేసేది కొన్ని సందర్భాల్లో అడ్డంకిగా భావిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయడానికి నన్ను అనుమతించలేదు. కానీ నేను రాజ్‌భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. అసెంబ్లీకి సంప్రదాయ ప్రసంగం చేయడానికి నన్ను అనుమతించలేదు. దానికి ఏవో కొన్ని కారణాలు చెబుతున్నారు." అన్నారు.

సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్ట‌మ‌ని చెప్పారు. తెలంగాణ రాజ్ భవన్ లో తనకు అయ్యే నెల‌వారీ ఖర్చుల‌ను తానే చెల్లిస్తున్నానని అన్నారు. గవర్నర్ హోదాలో ప్రత్యేక హెలికాప్టర్, ప్రత్యేక విమానం సేవలు పొందే అధికారం ఉన్నా.. తాను ఎప్పుడూ వాటిని వినియోగించలేదని అన్నారు. తెలంగాణలో తాను ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని రాజ్యాంగ సంరక్షకురాలిగా తన బాధ్యతలను మాత్రం నెరవేరుస్తున్నానని తెలిపారు. కానీ కొందరు తమ పనులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎవరు వ్యతిరేకించినా తాను చేయదలచుకున్న పనిని చేసి తీరుతానని అన్నారు.

తనకు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని పేర్కొంటూ భద్రాచలంలో జరిగిన ఉదంతాన్ని గుర్తుచేసుకున్నారు. వరదల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు భద్రాచలం వెళుతున్నానని తెలుసుకుని.. అప్పటివరకు ఏ మాత్రం పట్టించుకోకుండా కూర్చున్న ముఖ్యమంత్రి హడావుడిగా బాధిత ప్రాంతాలకు బయలుదేరారని అన్నారు.

తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడున్నా.. ప్రజలతో మమేకం అవడమే తనకు ఇష్టమని వారి కష్టసుఖాలు పంచుకుంటూ సాధారణ మహిళగానే జీవిస్తానని చెప్పారు. త‌మిళ‌నాడుకు రావ‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నార‌ని, కానీ త‌మిళ‌నాడుతో త‌న‌కు అనుబందం ఉందని దీనిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

First Published:  21 Oct 2022 8:18 AM GMT
Next Story