Telugu Global
Telangana

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు

గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య సంబంధాలు సరిగా లేని సంగతి అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తన పరిధికి మించి ఓ రాజకీయ నాయకురాలిగా మారారని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు
X

ఏ రాష్ట్రంలో అయినా గవర్నర్.. అక్కడి ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయినా సరే.. ఉత్తర్వులు మాత్రం గవర్నర్ పేరు మీదనే వెలువడతాయి. అంటే గవర్నర్ ఏమైనా మాట్లాడితే.. అది రాష్ట్ర ప్రభుత్వం మాటగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే, గవర్నర్ల నియామకం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉండటంతో.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే.. వారికి అనుకూలమైన వ్యక్తులను రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమిస్తుంటారు. అయితే ఒకసారి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సదరు వ్యక్తి తన రాజకీయ కెరీర్‌ను వదిలేసి న్యూట్రల్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. గతంలో కూడా కొంత మంది గవర్నర్లు తమకు పదవి ఇచ్చిన పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. కానీ తాజాగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై వ్యవహారం మాత్రం పూర్తిగా పార్టీ కార్యకర్తలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య సంబంధాలు సరిగా లేని సంగతి అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తన పరిధికి మించి ఓ రాజకీయ నాయకురాలిగా మారారని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఆ పార్టీ ఆరోపణలకు తగినట్లుగానే తమిళిసై వ్యవహారం కూడా ఉన్నది. ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో కూడా తలదూర్చడం.. సొంత పనులకు ప్రభుత్వం సహకరించడం లేదనే ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో సీఎం కేసీఆర్ అసలు రాజ్‌భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తమిళిసై ఓ బీజేపీ ఏజెంటులా మారిపోయారని టీఆర్ఎస్ నాయకులు విమర్శించడం చూస్తూనే ఉన్నాము.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఓ కార్యక్రమానికి వ్యతిరేకంగా తమిళిసై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం 'సమైక్యతా దినోత్సవం'గా చేయాలని పిలుపునిచ్చింది. ఆ రోజు హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నది. అయితే, గవర్నర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఏకంగా సెప్టెంబర్ 17ను విమోచనా దినంగా పాటించాలని పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. బుధవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన హైదరాబాద్ లిబరేషన్ మూవ్‌మెంట్ - ఫొటో అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన తమిళిసై.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రజాకార్లు, నిజాం చెర నుంచి బయటపడటానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని.. ఎందరో రక్తాన్ని చిందిస్తేనే ఈ విమోచనం దినం మనం జరుపుకుంటున్నామని తమిళిసై అన్నారు. ఈ రోజును ప్రజలు లిబరేషన్ డేగా జరుపుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విమోచనం కోసం హైదరాబాద్ స్టేట్ ప్రజలు చేసి పోరాటాలను తెలుసుకున్న రోజు తాను నిద్రపోలేక పోయానని చెప్పుకొచ్చారు. ఇలాంటి రోజును మనం ఎలా మరిచిపోగలం, రజాకార్ల అరాచకాలను మనం ఎలా చెరిపేయగలం.. అందుకే ప్రతీ తెలంగాణ పౌరుడు చరిత్రను తెలుసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

First Published:  14 Sept 2022 2:55 PM IST
Next Story