Telugu Global
Telangana

ఆర్టీసీ బిల్లుని గవర్నర్ ఎలా ఆపుతారు..? ఈ ప్రశ్నలకు బదులేది..?

ఒకవేళ నిజంగానే గవర్నర్ కి బిల్లుపై అభ్యంతరాలుంటే.. అసెంబ్లీ ఆమోదం తర్వాత, బిల్లుకి సంపూర్ణ రూపం వచ్చిన తర్వాత లేవనెత్తాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం సమాధానం చెబుతుంది. కానీ మొదట్లోనే సందేహాలంటూ బిల్లుని తొక్కిపెట్టడం సరికాదంటున్నారు నేతలు.

ఆర్టీసీ బిల్లుని గవర్నర్ ఎలా ఆపుతారు..? ఈ ప్రశ్నలకు బదులేది..?
X

తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై ఆమోదముద్ర వేయకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అసలు బిల్లుల విషయంలో గవర్నర్ కి ఉన్న అధికారాలేంటి..? రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లుని ఆపే అధికారం గవర్నర్ కి ఉందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

చర్చించాల్సింది ఎమ్మెల్యేలు కదా..?

బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే సందర్భంలో ఎమ్మెల్యేలు పలు సందేహాలను లేవనెత్తుతారు. అర్థవంతమైన చర్చ ద్వారా ఆ బిల్లుపై సందేహాలు మొదలవుతాయి, సూచనలు, సలహాలు అక్కడినుంచే వస్తాయి. ఆ తర్వాత బిల్లుకి మార్పులు చేర్పులు జరుగుతాయి, చివరిగా చట్టసభలో చట్టాన్ని రూపొందిస్తారు. అయితే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టకముందే గవర్నర్ దాని గురించి సమాచారాన్ని ఎలా అడుగుతున్నారనేదే ఇక్కడ అసలు ప్రశ్న.

రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం గవర్నర్ అనుమతితో ద్రవ్య బిల్లుని అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలి కాబట్టి మంత్రిమండలి ఆమోదం తర్వాత ఆర్టీసీ బిల్లు రాజ్ భవన్ కి చేరుకుంది. ఒకవేళ నిజంగానే గవర్నర్ కి బిల్లుపై అభ్యంతరాలుంటే.. అసెంబ్లీ ఆమోదం తర్వాత, బిల్లుకి సంపూర్ణ రూపం వచ్చిన తర్వాత లేవనెత్తాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం సమాధానం చెబుతుంది. కానీ మొదట్లోనే సందేహాలంటూ బిల్లుని తొక్కిపెట్టడం సరికాదంటున్నారు నేతలు.

సాధారణ బిల్లు లాగా ద్రవ్య బిల్లుని ఆపే అధికారం కేంద్రంలో రాష్ట్రపతికి కూడా లేదని ఆర్టికల్ 110, 111 చెబుతున్నాయి. మరిక్కడ తెలంగాణ గవర్నర్ కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తేవడం వింత విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ సాహసాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలోని వ్యక్తి రాజ్యాంగం ప్రకారం ఎందుకు నడచుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

First Published:  5 Aug 2023 1:09 PM IST
Next Story