Telugu Global
Telangana

తెలంగాణ ఉద్యమ తరహాలో రైతు పోరాటం..

దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతు నాయకులు తెలంగాణలో చేపట్టిన 'జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన' ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో రైతు సంఘాల నేతలతో రెండోరోజు సమావేశమైన సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలంగాణ ఉద్యమ తరహాలో రైతు పోరాటం..
X

"తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' అనిపించాం. అదే స్ఫూర్తితో నేడు రైతు వ్యతిరేకులతో కూడా 'జై కిసాన్' అనిపిద్దాం" అని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ దిశగా దేశంలోని రైతు నేతలంతా ప్రతినబూనాలని చెప్పారు. రైతు మర్యాదను నిలబెట్టి, రైతుల ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు నేతలకు పిలుపునిచ్చారాయన. దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతు నాయకులు తెలంగాణలో చేపట్టిన 'జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన' ఈ రోజుతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో రైతు సంఘాల నేతలతో రెండోరోజు సమావేశమైన సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భవిష్యత్ మార్గనిర్దేశనం చేశారు. రైతు సమస్యల పోరాటానికి ఉద్యమ పంథాకు, పార్లమెంట్ పంథాను సమన్వయం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దీనికి ఉత్తమమైన పరిష్కారమని చెప్పారు.

జట్టు కట్టి, పట్టుబట్టాలి..

రైతన్నలో గొప్ప శక్తి దాగి ఉందని, దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. మన సమస్యల పరిష్కారాన్ని మనమే అన్వేషించాలన్నారు. జట్టు కట్టి పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమమేనని చెప్పారు. కేసీఆర్ కంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, అవన్నీ విఫలమయ్యాయని, ఆనాటి వైఫల్యాలకు కారణాలు అన్వేషించి, ఆఖరి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని ఉద్యమ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి పోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలు కావాలన్నారు. ఆ స్థాయిలో వెనకడుగు వేయకుండా పోరాడితే కచ్చితంగా కేంద్రం మెడలు వంచి అనుకున్నది సాధించుకోగలమని చెప్పారు.

పార్లమెంటరీ పోరాటం.. రైతు రాజకీయం..

ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్ట సభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో లేదని, రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి వెళ్లాలని, ప్రశ్నించాలని, రైతుల సమస్యలకు పరిష్కారం సాధించాలని అన్నారు. ఎక్కడ ఆందోళన అవసరమవుతుందో అక్కడ ఆందోళన చేద్దాం.. ఎక్కడ రాజకీయాలు అవసరమవుతాయో అక్కడ రాజకీయాలు చేద్దామని చెప్పారు. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు నాయకులు.. వారి వారి ప్రాంతాలకు వెళ్లి స్థానిక నాయకులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని, మరోసారి హైదరాబాద్‌లో సమావేశమై జాతీయ స్థాయిలో ఐక్య సంఘటన రూపొందించుకుంటామని చెప్పారు కేసీఆర్.

అవ్వల్ దర్జా కిసాన్..

దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే 'అవ్వల్ దర్జా కిసాన్' గా తయారు చేద్దామన్నారు కేసీఆర్. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు అన్ని రాష్ట్రాల్లో రైతు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుందామన్నారు.


కేసీఆర్‌దే ఆభారమంతా..

దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను రైతు నాయకులు ముక్త కంఠంతో కోరారు. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్‌ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించే బాధ్యతను కేసీఆర్‌కే అప్పగించారు నేతలు. కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దామంటూ ప్రతినబూనారు.

ఓటు ద్వారానే మార్పు..

ఇన్నాళ్లూ రైతుల సమస్యలకు పరిష్కారం కేవలం ఉద్యమాలే అనుకుంటూ ఉన్నామని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు పార్లమెంట్‌కి వెళ్లి పోరాడాలని తీర్మానించినట్టు తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ రైతు సత్తా చూపిస్తామని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలు పెంచి, ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తూ, పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని, రైతు నాయకులు అభిప్రాయపడ్డారు. సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


సేవ్ ఇండియన్ ఫార్మర్స్..

మోదీ రైతు వ్యతిరేక చర్యలు దేశ రైతాంగానికి ప్రమాదకరంగా మారాయని, అలాంటి ప్రమాదం మరోసారి రాకుండా చూడాల్సిన బాధ్యత రైతాంగంపైనే ఉందన్నారు తమిళనాడు రైతు నాయకులు. దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్.. అంటూ వారు సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని, ఒకే దేశం - ఒకటే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగాలన్నారు. దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, అలాంటి కార్యక్రమాలు దేశ్యాప్తంగా అమలు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, కృషి వల్లే తెలంగాణలో శాంతి ఫరిఢవిల్లుతోందని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం తెలంగాణపై, హైదరాబాద్‌పై పడలేదంటే దానికి కారణం కేసీఆర్ విధానాలేనన్నారు రైతు నాయకులు. ఇది బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని చెప్పారు.

First Published:  28 Aug 2022 7:46 PM IST
Next Story