Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవ వేళ.. టీఎస్ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

TSRTC: దశాబ్ది ఉత్సవ వేళ.. టీఎస్ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు
X

దశాబ్ది ఉత్సవ వేళ.. టీఎస్ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్న వేళ.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జూలై 2022లోనే ఒక డీఏను ఇవ్వాల్సి ఉన్నది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయినట్లు వారు తెలిపారు. జూన్ 2023 నెల జీతంలో కలిపి 4.9 శాతం డీఏను ఇస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఇప్పటి వరకు ఏడు డీఏలను మంజూరు చేసిందని.. మిగిలిన ఒక్క డీఏ త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని వారు తెలిపారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించినట్లుగానే సంస్థ ఉద్యోగులకు రావల్సిన డీఏ బకాయిలు తప్పకుండా చెల్లిస్తుందని వారు చెప్పారు. ఎండీ వీసీ సజ్జనార్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కూడా వెల్లడించారు.

'తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది.’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, టీఎస్ఆర్టీసీ కార్మకులు, ఉద్యోగులకు డీఏ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఎండీ సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్మికుల కలను నిజం చేస్తూ సంతోషాలు నింపుతున్న యాజమాన్యానికి తప్పకుండా రుణపడి ఉంటామని అన్నారు.


First Published:  1 Jun 2023 6:33 PM IST
Next Story