Telugu Global
Telangana

ఒక వైపు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకుల టెన్షన్

బీజేపీ నుంచి నలుగురు నాయకులు శేరిలింగంపల్లి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో అనే టెన్షన్ ఉన్నది.

ఒక వైపు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నాయకుల టెన్షన్
X

బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ చాన్నాళ్ల ముందే టికెట్లు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టికెట్ల కసరత్తు ఇంకా కొనసాగిస్తుండగానే బీఆర్ఎస్ అభ్యర్థులు బీఫామ్స్ అందుకొని ప్రచారంలో దూసుకొని పోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకే టికెట్ ఇచ్చారు. ఆయన సెగ్మెంట్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గంగా రికార్డుకు ఎక్కిన శేరిలింగంపల్లిలో సెటిలర్ల ఓట్లు చాలా ఎక్కువ. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

బీజేపీ నుంచి నలుగురు నాయకులు శేరిలింగంపల్లి టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో అనే టెన్షన్ ఉన్నది. ఇప్పటి వరకు టికెట్ల విషయంలో బీజేపీ ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆశావహులు సైలెంట్‌గా ఉండిపోయారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్నవారిలో రవికుమార్ యాదవ్ మాత్రం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ జనాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో నియోజకవర్గ ఇంచార్జి మునిరత్ననాయుడు రంగంలోకి దిగారు. ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పని చేస్తామని ఆయా నేతలతో పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేయించడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు కాంగ్రెస్ నుంచి రఘునాథ్ యాదవ్‌ టికెట్ ఆశిస్తున్నారు. ప్రజల్లో తిరుగుతూ తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ హామీతోనే ఆయన పార్టీలో చేరుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు టెన్షన్ పడుతున్నారు. స్థానిక నాయకులు జరిపేటి జైపాల్, సత్యనారాయణరావులు కూడా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. తమకు తెలిసిన దారుల్లో ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెరగడంతో నాయకులు టెన్షన్ పడుతున్నారు.


First Published:  17 Oct 2023 12:48 PM IST
Next Story