Telugu Global
Telangana

కేంద్రం వరద సాయం చేస్తుందని నమ్మకం లేదు

గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి వరద సాయం కూడా రాలేదని స్వయంగా మంత్రి కేటీఆర్ లెక్కల రుజువులు చూపించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.

కేంద్రం వరద సాయం చేస్తుందని నమ్మకం లేదు
X

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపారమైన నష్టం వాటిల్లింది. వర్షాలతో పాటు గోదావరి వరద కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు టెంపుల్ టౌన్ భద్రాచలం కూడా నీట మునిగింది. ఇప్పటికీ పట్టణం చుట్టుపక్కల కొన్ని కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఉమ్మడి అదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వ్యక్తిగత నష్టమే కాకుండా రోడ్లు పాడైపోయి, భవనాలు శిథిలమై ప్రభుత్వానికి కూడా భారీ నష్టం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, ఆరుగులు సభ్యులు గల కేంద్ర బృందం గురువారం రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. అంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల సాయం చేయమని ఒక లేఖను వారికి అందించింది. గోదావరి వరద, వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని.. తిరిగి అక్కడ మౌళిక సదుపాయాల పునరుద్దరణకు భారీగా నిధులు అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1000 కోట్ల సాయం అందిస్తే.. మిగిలిన నిధులను రాష్ట్రం భరిస్తుందని వెల్లడించారు.

అయితే కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినా.. రాష్ట్రం కోరిన సాయం చేస్తుందనే నమ్మకం లేదని అధికారులు అంటున్నారు. ఆర్థికంగా తెలంగాణను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. 2020 అక్టోబర్‌లో హైదరాబాద్ సహా తెలంగాణలో భారీ వరదలు వచ్చి అపార నష్టం వాటిల్లింది. ఆ సమయంలో వరద సాయం అందించాలని అంచనాలు వేసి రూ. 1000 కోట్లు ఇవ్వాలని కోరింది. కానీ కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి వరద సాయం కూడా రాలేదని స్వయంగా మంత్రి కేటీఆర్ లెక్కల రుజువులు చూపించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఇటీవల వరదలకు ఆర్ అండ్ బీ శాఖ ఎక్కువగా నష్టపోయింది. రోడ్లు, భవనాలకు కలిగిన డ్యామేజ్ రూ. 498 కోట్లుగా అంచనా వేసింది. కాజ్‌వేలు, బ్రిడ్జిలు చాలా ప్రాంతాల్లో కొట్టుకొని పోయాయి. అలాగే అప్రోచ్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇక పంచాయతీ రాజ్ పరిధిలో రూ. 449 కోట్లు, మున్సిపాలిటీల పరిధిలో రూ. 379 కోట్ల నష్టం కలిగింది. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద వచ్చిన పగుళ్ల రిపేర్లకు దాదాపు రూ. 33 కోట్లు అవసరం అని అధికారులు చెప్తున్నారు. విద్యుత్ శాఖకు రూ. 7 కోట్ల మేర డ్యామేజ్ అయ్యింది. మరోవైపు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సాయం కోసం రూ. 25 కోట్లు ఖర్చు అవుతోంది. ఇందుకు అవసరమయ్యే నిధులన్నీ రాష్ట్రమే భరిస్తోంది.

First Published:  21 July 2022 4:07 PM IST
Next Story