అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం.. పొలిటికల్ మైలేజ్ కోసమేనా..?
భారత్ స్వతంత్రం పొందాక కూడా హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాం పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ఆపరేషన్ పోలోతో ఈ ప్రాంతం దేశంలో విలీనమైది.
సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవం (హైదరాబాద్ లిబరేషన్ డే)గా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బీజేపీ తన పంతం నెగ్గించుకుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్లో పేర్కొంది.
ఆ అమరుల్ని స్మరించుకోవడానికేనన్న కేంద్రం
"భారత్ స్వతంత్రం పొందాక కూడా హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాం పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ఆపరేషన్ పోలోతో ఈ ప్రాంతం దేశంలో విలీనమైది. అందువల్లే ఆ రోజున హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది" అని హోం శాఖ నోటిఫికేషన్లో ప్రకటించింది.
రాజకీయంగా కలిసొస్తుందా?
గత పదేళ్లుగా కేసీఆర్ హయాంలో విమోచన దినోత్సవాన్ని సరిగ్గా జరపనివ్వలేదని బీజేపీనేతలు గుర్రుగా ఉన్నారు. నిజాం నుంచి స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంతోనే విమోచన దినోత్సవానికి అధికారిక ముద్ర వేయించడం ద్వారా ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసి, తెలంగాణలో రాజకీయంగా లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే ఈ తరంలో అది ఎంతమంది ఓటర్లను కదిలించి ఓట్లు వేయిస్తుందన్నదే ప్రశ్న.