Telugu Global
Telangana

దేశవ్యాప్తంగా బీజేపీకి దూరమవుతోన్న‌OBCలు... తెలంగాణలో బీజేపీ నేతల వ్యర్థ ప్రయత్నాలు

ఒక వైపు ఇతర పార్టీల్లోంచి బీసీ నేతలను ఆకర్షించాలన్న బీజేపీ ప్రయత్నాలు సఫలం కాకపోగా ఆ పార్టీలోంచే బీసీ నేతలు టీఆరెస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీని వీడి టీఆరెస్ లో చేరడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా బీజేపీకి దూరమవుతోన్న‌OBCలు... తెలంగాణలో బీజేపీ నేతల వ్యర్థ ప్రయత్నాలు
X

దేశవ్యాప్తంగా అనేక ఏళ్ళ పాటు బీజేపీకి వెన్నుదన్నుగా ఉండిన ఓబీసీలు ఆ పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. 2023 , 2024లో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఈ వర్గాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నందున, బీజేపీ నాయకత్వం టెన్షన్ లో ఉంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ వర్గాలు పార్టీకి దూరమవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓబీసీలను తమ వైపు ఆకర్షించడానికి బీజేపీ నాయకత్వం పడరాని పాట్లు పడుతోంది.

మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే ఓబీసీలు కాషాయ పార్టీకి దూరమయ్యారు. 2003 నుంచి బీజేపీకి మద్దతిస్తున్న ఓబీసీ వర్గాలు తొలిసారిగా 2018లో కాంగ్రెస్ వైపు మళ్ళారు. ఫలితంగా అక్కడ బీజేపీ ఓటమి పాలయ్యి, కాంగ్రెస్ గెలిచింది. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ను‍ంచి తమ పార్టీలోకి ఫిరాయింపులు జరిపి అధికారం చేజిక్కించుకోగలిగింది బీజేపీ.

మధ్యప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, బీజేపీ నాయకత్వం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మధ్యప్రదేశ్ ఓటర్లలో OBCలు 48 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాల్లో 100 కంటే ఎక్కువ స్థానాల్లో OBCలే అధికంగా ఉన్నారు. దాంతో OBCలను తిరిగి తమవైపు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు.

గుజరాత్‌లో కూడా అదే పరిస్థితి ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓబీసీ లకు 10 శాతం రిజర్వేషన్‌తో సహా ఈ వర్గాలకు ఇచ్చిన చాలా వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనందున, OBC లు బిజెపి పై ఆగ్రహంగా ఉన్నారు. గుజరాత్‌లో జరిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓబీసీలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని పోల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితే ఇలా ఉంటే కిందా మీదా పడుతూ లేస్తూ నడుస్తున్న తెలంగాణ బీజేపీకి ఇక్కడ ఓబీసీలను బుట్టలో వేయడం ఎలా అన్న చింత పట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ అయిన బండి సంజయ్ ను నియమించారు. మరో బీసీ అయిన కె లక్ష్మణ్ కు బిసి మోర్చా జాతీయ అధ్యక్షపదవే కాక రాజ్యసభ సభ్యత్వమిచ్చారు. ఇక‌ జిల్లా, మండల, నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఎక్కువగా ఓబీసీలనే నియమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు పట్టు భిగించి ఉన్న అగ్రవర్ణాలు అడ్డుపడుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు. ఓబీసీలకు పదవులు ఇవ్వడమే కాక ఆ వర్గాలను మత ప్రాతిపదికన రెచ్చగొట్టాలనే ప్రణాళికలు రచిస్తున్నారు బీజేపీ నాయకులు. బైంసా లాంటి చోట్ల ఇప్పటికే తమ ప్రణాళికలు అమలుపరుస్తున్నారు కూడా.

ఒక వైపు ఇతర పార్టీల్లోంచి బీసీ నేతలను ఆకర్షించాలన్న బీజేపీ ప్రయత్నాలు సఫలం కాకపోగా ఆ పార్టీలోంచే బీసీ నేతలు టీఆరెస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు బీజేపీని వీడి టీఆరెస్ లో చేరడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.

అయితే, తెలంగాణలో ఓబీసీలు మొదటి నుంచి టీఆరెస్ తో ఉన్నందున, భవిష్యత్తులో కూడా బీసీలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వీ కృష్ణమోహన్ రావు అన్నారు.

''టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల బీసీలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు వారికి అందుతున్నాయి. కేసీఆర్ కు బీసీలు ఎల్లవేళలా అండగా ఉంటారు'' అని కృష్ణమోహన్ రావు ధీమాగా వ్యక్తం చేశారు.

First Published:  6 Dec 2022 1:41 PM IST
Next Story