Telugu Global
Telangana

కాళ్లు మొక్కుతూ.. ఓట్లు అడుగుతూ..

చౌటుప్పల్ పట్టణంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పాదాభివందనం చేపట్టారు. మునుగోడు ప్రచారంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాళ్లు మొక్కుతూ.. ఓట్లు అడుగుతూ..
X

ఎన్నికల్లో ఓటర్ల చేతిలో మేనిఫెస్టో పెట్టి లేదా నమూనా బ్యాలెట్ పెట్టి ఓట్లు అడగడం ఓ స్టైల్, ఆడవారయితే బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి విభాగం NSUI నేతలు కాళ్లు మొక్కి మరీ ఓట్లు అడుగుతున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతి ఓటరుని వ్యక్తిగతంగా కలవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు NSUI నేతలు వ్యక్తిగతంగా కలుస్తూ ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పాదాభివందనం..

ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం అనే కార్యక్రమం చేపట్టారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లడం ఓటర్ల కాళ్లు మొక్కడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వేడుకోవడం, ఓటు వేస్తామంటూ హామీ ఇచ్చాకే కాళ్లపైనుంచి లేవడం.. ఇలా చేస్తున్నారు NSUI నేతలు. చౌటుప్పల్ పట్టణంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ పాదాభివందనం చేపట్టారు. వెయ్యిమంది విద్యార్థి నాయకుల బృందం ఇలా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు పాదాభివందనం చేయడం మునుగోడు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..

గత ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడదామనే ఉద్దేశంతో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకున్నారని, ఆయన కాంట్రాక్ట్ డబ్బులకోసం ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని వివరిస్తూ ముందుకు కదులుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆయనకు బుద్ధి చెప్పాలంటే ఇక్కడ తిరిగి కాంగ్రెస్ ని గెలిపించాలని వేడుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ విలువ ఏంటో తెలియజెప్పాలని కోరుతున్నారు. చౌటుప్పల్ తో మొదలు పెట్టి మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాదాభివందనం చేపట్టేందుకు NSUI నేతలు ప్రణాళికలు రచించారు. విద్యార్థి విభాగం నేతలు ఇప్పటికే మండల కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలసి వారు ప్రతి ఇంటికీ ప్రచారానికి వెళ్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

First Published:  16 Oct 2022 7:44 AM IST
Next Story