లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ
దుద్యాల మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం
లగచర్లలో బహుళార్థ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేశారు. రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం విదితమే.
నిన్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఫార్మా పరిశ్రమల ఏర్పాటునకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిర్వహించ తలపెట్టిన గ్రామ సభ ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి లపై ఆయా గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అన్నిపార్టీల వారు పాల్గొన్నా కాంగ్రెస్ వారిని తప్పించి అమాయకులైన గిరిజన రైతులను కేసులో ఇరికించారని, గిరిజన మహిళలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. బాధితులు కూడా జాతీయ ఎస్సీ, ఎస్టీ, మానవహక్కుల కమిషన్ ముందు పోలీసులు, ప్రభుత్వ తీరుపై వివరించారు. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించడం, సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలోనే రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉన్నదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.