Telugu Global
Telangana

ప‌ట్నం సునీత‌పై అవిశ్వాస తీర్మానం.. షాకిచ్చిన బీఆర్ఎస్ జెడ్పీటీసీలు

ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్‏లో చేరిన మరుసటి రోజే బీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ జెడ్పీటీసీల‌ను కూడ‌గ‌ట్టి సునీతపై తిరుగుబాటు జెండా ఎగ‌రేయించారు.

ప‌ట్నం సునీత‌పై అవిశ్వాస తీర్మానం.. షాకిచ్చిన బీఆర్ఎస్ జెడ్పీటీసీలు
X

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిన ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి కుటుంబానికి పెద్ద షాక్ త‌గిలింది. వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. మొత్తం 12 మంది జెడ్పీటీసీలు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్ని అడిష‌న‌ల్ కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు అందజేశారు.

కాంగ్రెస్‌లో చేరిన మర్నాడే టిట్ ఫ‌ర్ టాట్‌

ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్‏లో చేరిన మరుసటి రోజే బీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ జెడ్పీటీసీల‌ను కూడ‌గ‌ట్టి సునీతపై తిరుగుబాటు జెండా ఎగ‌రేయించారు. అవిశ్వాస తీర్మానంపై జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయకుమార్‌తోపాటు మొత్తం 12 మంది బీఆర్ఎస్ జెడ్పీటీసీలు సంత‌కాలు చేశారు. తీర్మానం అందజేసిన 15 రోజుల్లో అధికారులు నోటీసులు ఇవ్వాలి.

ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది..?

ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ బ‌లం 14. కాంగ్రెస్‌కు నలుగురు సభ్యులు ఉన్నారు. ఈనేప‌థ్యంలో అవిశ్వాస తీర్మానం నెగ్గ‌డం సునీతా మహేందర్‌రెడ్డికి దాదాపు అసాధ్యం. బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో గెలిచిన ఆమె బేషరతుగా చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయాలని వైస్‌ చైర్‌పర్సన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌ డిమాండ్ చేస్తున్నారు. న‌లుగురు స‌భ్యులే ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

First Published:  18 Feb 2024 1:26 PM IST
Next Story