Telugu Global
Telangana

మధు యాష్కీనే కాదు.. ఎవరు బరిలో ఉన్న గెలిచేది నేనే : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దేవిరెడ్డినే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో నాన్-లోకల్ అయిన మధు యాష్కి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

మధు యాష్కీనే కాదు.. ఎవరు బరిలో ఉన్న గెలిచేది నేనే : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
X

ఎల్బీనగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల అభ్యర్థులు మాటల తూటాలు పెంచారు. సోమవారం ఏకంగా మాజీ కొలీగ్స్ మధ్య పోస్టర్ల, మాటల యుద్దం నడిచింది. రాష్ట్రమంతా ఎల్బీనగర్ వైపు ఆసక్తిగా చూసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయానికి కాంగ్రెస్ తరపున మధు యాష్కి దరఖాస్తు చేసుకున్నారు. ఎల్బీనగర్ నుంచి ప్రాథమికంగా మధుయాష్కి పేరును కూడా టీపీసీసీ పరిగణలోకి తీసుకున్నది. సోమవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ఈ క్రమంలో గాంధీభవన్ గోడల మీద మధు యాష్కికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

మధు యాష్కి గో బ్యాక్.. అంటూ గాంధీభవన్ గోడలపై పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాగా, ఈ పోస్టర్లను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డే వేయించారని మధుయాష్కి ఆరోపించారు. ఓడిపోతాననే భయంతోనే దేవిరెడ్డి ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇద్దరు కలిసి పని చేశారు. గత ఎన్నికల్లో చేతి గుర్తు మీదే గెలిచిన దేవిరెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దేవిరెడ్డినే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో నాన్-లోకల్ అయిన మధు యాష్కి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

కాగా, మధు యాష్కి ఆరోపణలపై దేవిరెడ్డి సుధీర రెడ్డి స్పందించారు. మధుయాష్కి సహా ఎవరు పోటీ చేసినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మధు యాష్కి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయకుండా తాను అడ్డుపడుతున్నానని, కాంగ్రెస్ శ్రేణులను రెచ్చగొడుతున్నానని అనడం అవాస్తవమని సుధీర్ రెడ్డి అన్నారు. నాపై ఎవరు పోటీ చేసినా తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్లు వేయించాల్సిన అవసరం తనకు లేదని.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలవడం ఖాయమని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.

First Published:  5 Sept 2023 6:56 AM IST
Next Story