Telugu Global
Telangana

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం కాదు.. ఢిల్లీ సుల్తాన్ పట్టాభిషేకమది - ఒవైసీ విమర్శలు

హిందూ మత పెద్దలను పార్లమెంట్‌ లోపలికి తీసుకు వెళ్లిన ప్రధాని మోడీ.. అర్చ‌కుడిని, ముస్లిం మత పెద్దలను మాత్రం ఎందుకు లోపలికి తీసుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం కాదు.. ఢిల్లీ సుల్తాన్ పట్టాభిషేకమది - ఒవైసీ విమర్శలు
X

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రాజకీయ పార్టీల మధ్య ఎన్నో వివాదాలను సృష్టించింది. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా మోడీ ప్రారంభించడంతో ఆ కార్యక్రమానికి దేశంలోని చాలా పార్టీలు దూరంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి ముందు ఈ వ్యవహారంపై ఎన్నో వివాదాలు తలెత్తగా.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత కూడా వివాదాలు కొనసాగుతున్నాయి.

పార్లమెంట్‌ ప్రారంభోత్సవం జరిగిన విధానంపై పలువురు నాయకులు తప్పుపడుతున్నారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అది పార్లమెంట్‌ ప్రారంభోత్సవంలా లేదని.. ఢిల్లీ సుల్తాన్ పట్టాభిషేకంలా అనిపించిందని విమర్శించారు. హిందూ మత పెద్దలను పార్లమెంట్‌ లోపలికి తీసుకు వెళ్లిన ప్రధాని మోడీ.. అర్చ‌కుడిని, ముస్లిం మత పెద్దలను మాత్రం ఎందుకు లోపలికి తీసుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

భారతదేశానికి మతం లేదని.. భారతదేశం అన్ని మతాలను నమ్ముతుందన్నారు. మోడీ ప్రభుత్వం హిందువులను మాత్రమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా విమర్శలు చేశారు. వేడుకలకు దక్షిణాదిలోని ధర్మాచార్యులను మాత్రమే పిలిచారని.. ఉత్తరాది వారిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు.

కాగా, ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఒవైసీ హిందూ -ముస్లింల మధ్య చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. ఇదిలా ఉంటే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముందు, ఆ తర్వాత అధికార.. ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడులు కొనసాగగా.. చాలామంది ఎంపీలకు మాత్రం ఇవి పట్టలేదు. నిన్న నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి హాజరైన చాలామంది ఎంపీలు కొత్త పార్లమెంట్‌ ఏ విధంగా కట్టారో చూసేందుకు ఆసక్తి చూపారు. భవనమంతా కలియదిరిగి కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు.

First Published:  29 May 2023 6:55 AM GMT
Next Story