Telugu Global
Telangana

గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ బంకులు, యూరియా బస్తాలపై మోదీ ఫొటోలు..

రేషన్ షాపుల వద్దే ఎందుకు.. మోదీ ఫొటోలు ఇంకా ప్రముఖంగా కనిపించాలంటే ఊరూరా పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్‌ సిలిండర్లపైన, యూరియా బస్తాల మీద కచ్చితంగా ప్రధాని మోదీ ఫొటోలు పెడతామంటూ సెటైర్లు వేశారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.

గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ బంకులు, యూరియా బస్తాలపై మోదీ ఫొటోలు..
X

రేషన్ షాపుల వద్దే ఎందుకు.. మోదీ ఫొటోలు ఇంకా ప్రముఖంగా కనిపించాలంటే ఊరూరా పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్‌ సిలిండర్లపైన, యూరియా బస్తాల మీద కచ్చితంగా ప్రధాని మోదీ ఫొటోలు పెడతామంటూ సెటైర్లు వేశారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌ లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ 10లక్షల కోట్ల రూపాయలు ఆయన మిత్రులకు పంచి పెట్టారని, కానీ పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే పథకాలు మాత్రం వద్దంటున్నారని అన్నారు. ఇదెక్కడి వివక్ష అని ప్రశ్నించారు.

నిర్మలా సీతారామన్ వంటి కేంద్ర మంత్రులు రేషన్ షాపుల వద్దకు వచ్చి కలెక్టర్లను నిలదీయడం ఏంటని ప్రశ్నించారు కవిత. కేంద్ర మంత్రులు అసలు తెలంగాణకు వచ్చి ఎందుకు పంచాయితీలు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఎప్పుడైనా రేషన్‌ షాపు ముందు ఫొటోలు పెట్టారా? అని ప్రశ్నించారామె. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు సృష్టించాలనుకుంటున్నారని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. వాట్సప్‌ లో జరిగే తప్పుడు ప్రచారాన్ని యువకులు ఖండించాలని సూచించారు..

ధరల పెరుగుదలకు కేసీఆర్ కారణమా..?

ధరల పెరుగుదలకు కేసీఆర్ కారణం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు కవిత. పొరుగు రాష్ట్రాల్లో పప్పులు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో గమనించాలని పేర్కొన్నారు. తెలంగాణలో రేట్లు ఏ ఇతర రాష్ట్రం కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రశ్నించారామె. అవకాశం వచ్చినపుడు ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. ఆ నమ్మకం తనకు ఉందని అన్నారు కవిత.

First Published:  7 Sept 2022 5:36 PM IST
Next Story