పాలకుర్తిలో స్థానికేతర వివాదం.. కాంగ్రెస్ అభ్యర్థికి నోటీసులు
ఎన్నికల సమయంలో తమ కోడలిని ఒంటరిగా ఎలా వదిలి వెళ్తామని ప్రశ్నించారు యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. నోటీసుపై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ కంటతడి పెట్టారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు టౌన్‌లో మంగళవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ప్రచారం ముగిసిన తరువాత నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండకూడదనేది నిబంధన. కాగా, ఈ నిబంధన పాటించకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి అత్తమామలు అనుమానండ్ల ఝాన్సీ, రాజేందర్ రెడ్డిలను నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ప్రచారంలో పాల్గొనేందుకు తొర్రూరులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు యశస్విని రెడ్డి అత్తమామలు. మంగళవారం ప్రచార గడువు ముగియడంతో NRIలు అయిన వారిద్దరూ తొర్రూరులో ఉండకూడదని డీఎస్పీ వెంకటేశ్వర బాబు నోటీసులు ఇచ్చారు. ఈ వివాదంపై స్పందించిన స్థానిక ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ.. రెండు రోజుల ముందుగానే వారికి నిబంధనలు తెలియజేశామన్నారు. మొదట SIతో నోటీసులు పంపగా తిరస్కరించడంతో ఎన్నికల అధికారుల సూచన మేరకు డీఎస్పీ వెళ్లి నోటీసులు ఇచ్చారు.
ఎన్నికల సమయంలో తమ కోడలిని ఒంటరిగా ఎలా వదిలి వెళ్తామని ప్రశ్నించారు యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి. నోటీసుపై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ కంటతడి పెట్టారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మొదట ఝాన్సీరెడ్డి పోటీ చేయాలని భావించినప్పటికీ.. NRI కావడంతో ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు.