నేడు నామినేషన్ల స్క్రూటినీ మొదలు.. ఉపసంహరణకు 15 వరకు గడువు
మొత్తం 119 నియోజవర్గాలకు సంబంధించి 4,798 నామినేషన్ లు దాఖలయ్యాయి. వీటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్లతోపాటు బీ ఫామ్ లు సమర్పించిన వారిని ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులుగా గుర్తిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఈనెల 3 నోటిఫికేషన్ విడుదల కాగా అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 10తో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. మూడు రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు నామినేషన్ల స్క్రూటినీ మొదలవుతుంది. నామినేషన్లలో అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటినే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. మిగతా వాటిని పక్కనపెడతారు.
మొత్తం 119 నియోజవర్గాలకు సంబంధించి 4,798 నామినేషన్ లు దాఖలయ్యాయి. వీటన్నిటినీ రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్లతోపాటు బీ ఫామ్ లు సమర్పించిన వారిని ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులుగా గుర్తిస్తారు. బీ ఫామ్ లు ఇవ్వలేని వారిని స్వతంత్రులుగా పరిగణిస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు, వారిలో ఒకరే పార్టీ బీ ఫామ్ సమర్పించారు. మిగతా వారు ఆ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారు.
ఈనెల 15 వరకు ఉపసంహరణ..
ఈనెల 15 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది. రెబల్స్ గా నామినేషన్లు వేసిన వారితో అసలు అభ్యర్థులకు ముప్పు పొంచి ఉంది. దీంతో ఈ రెండు రోజులపాటు బుజ్జగింపుల పర్వం జరిగే అవకాశముంది. బీ ఫామ్ దక్కనివారు స్వతంత్రులుగా బరిలో ఉంటారా, లేక పోటీనుంచి తప్పుకుంటారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈనెల 15న నామినేషన్ల ఉపసంహరణ ముగిస్తే.. తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. వారికి గుర్తులు కూడా కేటాయిస్తారు. అప్పటినుంచి స్వతంత్రులు తమ గుర్తులను ప్రజలు గుర్తుంచుకునేలా ప్రచారం చేయాల్సి ఉంటుంది.