కేసీఆర్, కేటీఆర్.. నామినేషన్ల ఖర్చు ఎంతో ప్రత్యేకం
అధినేతల కోసం డబ్బులు సేకరించి ముఖరా.కె. గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఎన్నికల వేళ సహజంగా అభ్యర్థులు డబ్బులు పంచి పెడుతుంటారు. కానీ ఆ గ్రామస్తులు మాత్రం నాయకులకే తమ తరపున విరాళాలు అందించి పెద్దమనసు చాటుకున్నారు. ఆ విరాళం ఇచ్చింది మరీ ఉన్నోళ్లేం కాదు, నిరుపేదలు. ఆసరా పెన్షన్లు అందుకుంటున్న వారు. తమకు పెన్షన్లు రావడం సీఎం కేసీఆర్ చలవేనంటున్నవారు ఒకనెల పెన్షన్ సొమ్ముని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్ల కోసం ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇలా పెద్ద మనసు చాటుకున్న ఆ గ్రామంపేరు ముఖరా.కె.
దేశవ్యాప్తంగా స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రతిసారి వినిపించే పేరు ముఖరా.కె. స్వచ్ఛ అవార్డులు సాధించడంలో ముందున్న ఈ గ్రామం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ల ఖర్చు భరించేందుకు ముందుకు రావడం విశేషం. ఈ గ్రామంలో 100మంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వారందరూ తలా వెయ్యిరూపాయల చొప్పున లక్ష రూపాయల నగదు సేకరించి సర్పంచ్ గాడ్గె మీనాక్షి చేతిలో పెట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తమ పేరు మీద నామినేషన్ ఖర్చుల కోసం ఇచ్చి రావాలని సర్పంచిని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో ప్రగతి భవన్ కు చేరుకున్న సర్పంచ్ మీనాక్షి.. సీఎం కేసీఆర్ ను కలిసి రూ.50వేల చొప్పున రెండు చెక్కులను అందజేశారు. ముఖరా.కె గ్రామస్తులకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృతజ్జతలు తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు ఇవ్వడంతోపాటు పార్టీ ఫండ్ కూడా చెక్కు రూపంలో అప్పుడే అందజేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రచార ఖర్చులతోపాటు, నామినేషన్ ఖర్చులు కూడా పార్టీ ఇచ్చే రూ.40లక్షల నుంచి ఖర్చు చేయాలని సూచించారు. అయితే అధినేతల కోసం డబ్బులు సేకరించి ముఖరా.కె. గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
♦