Telugu Global
Telangana

ఆన్‌లైన్‌లో నామినేషన్ వెయ్యొచ్చు.. తెలంగాణ ఎన్నికల్లో ఈసీ నిర్ణయం

నవంబర్ 10వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్ వెయ్యొచ్చు.. తెలంగాణ ఎన్నికల్లో ఈసీ నిర్ణయం
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో కూడా దాఖలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన పత్రాలను తిరిగి ప్రత్యక్షంగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇప్పటికే గవర్నర్ అనుమతి తీసుకున్నారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల గదిలో ఉండే గోడ గడియారమే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల స్వీకరణ నిలిపివేస్తామని అన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చని.. అఫిడవిట్ల విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అభ్యర్థులు సమర్పించే నామినేషన్లలోని అఫిడవిట్లను అదే రోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయనున్నట్లు వికాస్ రాజ్ స్పష్టం చేశారు. పోస్టల్, నమూనా బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించనున్నట్లు చెప్పారు. గతంలో గుర్తుల విషయంలో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. ఈ సారి అలాంటివి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోసం 60 మంది కేంద్ర పరిశీలకులు శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు.

తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు వికాస్ రాజ్ చెప్పారు. దీంతో ఇప్పటికే నిర్ధారించిన 35,356 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరిన్ని అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై ఈ వారంలోగా నిర్ణయం తీసుకుంటామని.. నవంబర్ 10వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు.

First Published:  1 Nov 2023 9:00 AM IST
Next Story