Telugu Global
Telangana

లీగల్ నోటీసు ఉపసంహరించుకునేదే లేదు.. ఎంపీ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ ఘాటైన సమాధానం

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హెచ్ఎండీఏ స్పందించింది. మే 25న తాము పంపిన లీగల్ నోటిసుపై టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి చేసి తాజా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నది.

లీగల్ నోటీసు ఉపసంహరించుకునేదే లేదు.. ఎంపీ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ ఘాటైన సమాధానం
X

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లీజు విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై హెచ్ఎండీఏ లీగల్ నోటిసు పంపించిన విషయం తెలిసిందే. కాగా, ఈ లీగల్ నోటీసు విషయంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తనకు నోటీసు పంపిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వెంటనే దాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ ఒక రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నారని.. ఓఆర్ఆర్ లీజు విషయంలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేదంటూ మీడియా ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హెచ్ఎండీఏ స్పందించింది. మే 25న తాము పంపిన లీగల్ నోటిసుపై టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి చేసి తాజా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నది. హెచ్ఎండీఏ అధికారులపై రాజకీయ సంబంధిత వ్యాఖ్యలు చేయడంపై ఘాటుగా స్పందించింది.

హెచ్ఎండీఏ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. అది పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకత్వలోనే నడుస్తుంది. హెచ్ఎండీఏలో పని చేసే అధికారులు, వారు చేపట్టే శాఖా సంబంధిత పనులు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్ నిర్దేశకత్వంలోనే సాగుతాయి. ప్రభుత్వం ఆదేశించే అన్ని పనులను హెచ్ఎండీఏ అధికారులు చేపడతారని సంస్థ పేర్కొన్నది .

ఇటీవల ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని హెచ్ఎండీఏ పేర్కొన్నది. అంతర్జాతీయ స్థాయి బిడ్లను ఆహ్వానించి.. టీవోటీ పద్దతిలో అత్యధిక బిడ్ కోట్ చేసిన వారికే టెండర్లు అప్పగించామని చెప్పింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు లేదని.. ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలలోనే జరిగిందని చెప్పింది.

కాగా, ఈ టెండర్ల విషయంలో ప్రతీ సారి హెచ్ఎండీఏను తప్పుపట్టడమే కాకుండా.. ఈ టెండ్లను హెచ్ఎండీఏ తరపున నిర్వహించిన అధికారుల పేర్లను ఎంపీ రేవంత్ రెడ్డి పదే పదే మీడియా ముందు పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. హెచ్ఎండీఏలో పని చేసే ప్రతీ అధికారి సంస్థ, ప్రభుత్వం తరపునే పని చేస్తారు కానీ.. వారికి ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండవని పేర్కొన్నది. రేవంత్ రెడ్డి కావాలనే అధికారులను తప్పుబడుతూ, వారి పేర్లను మీడియా ముందు పేర్కొంటున్నారని తెలిపింది.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి పంపిన లీగల్ నోటీసులను హెచ్ఎండీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోదని సంస్థ తెలియజేసింది. అధికారుల చిత్తశుద్దిని పరీక్షించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హెచ్ఎండీఏ విమర్శించింది. ఎంపీ రేవంత్ రెడ్డి ఆర్టీఏ ద్వారా అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పామని.. ఇందులో దాచుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.

First Published:  13 Jun 2023 9:13 PM IST
Next Story