తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2024 వరకు కరెంట్ టారిఫ్ పెంపు లేదు
టీఎస్ఈఆర్సీకి బుధవారం ఇచ్చిన ప్రతిపాదనల్లో టారిఫ్ పెంపు విషయంపై ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో 2024 మార్చి వరకు రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్‌లు పెంచే అవకాశం లేనట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త. మరో ఏడాదిన్న పాటు రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్‌ల పెంపు ఉండబోదు. రాష్ట్రంలో టీఎస్ఎన్‌పీడీసీఎల్, టీఎస్ఎస్‌పీడీసీఎల్ సంస్థలు విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి. ఆ రెండు సంస్థలు టారిఫ్‌లు పెంచాలంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) ఆమోదం తప్పని సరి. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టీఎస్ఈఆర్సీకి బుధవారం ఇచ్చిన ప్రతిపాదనల్లో టారిఫ్ పెంపు విషయంపై ఎలాంటి ప్రస్తావన లేదు. దీంతో 2024 మార్చి వరకు రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్‌లు పెంచే అవకాశం లేనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే టీఎస్ఈఆర్సీ కనుక పెంచాలని భావిస్తే మాత్రం ప్రజలపై భారం పడే అవకాశం ఉంటుంది.
తెలంగాణలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 54,060 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. అలాగే 83,111 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం అని ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 73,618 మిలియన్ యూనిట్ల విద్యుత్ అమ్మకం జరుగుతుందని అంచనా వేశాయి. సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ. 36,963 కోట్లు, నార్తరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ. 17,095 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశాయి. ఈ రెండు సంస్థలకు విద్యుత్ కొనుగోలు తర్వాత వచ్చే ఆదాయంలో రూ. 10,535 కోట్ల గ్యాప్ వస్తోంది. అయినా సరే విద్యుత్ చార్జీల పెంపునకు మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.
కాగా, రెండు సంస్థల నుంచి ప్రతిపాదనలు రాకపోయినా.. టీఎస్ఈఆర్సీ ఏవైనా ప్రతిపాదనలు చేస్తే త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని కమిషన్ చైర్మన్ టి. శ్రీరంగరావు అన్నారు. ప్రస్తుతానికైతే రెండు కంపెనీలకు పాత టారిఫ్ కంటిన్యూ చేయడానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఇతర ప్రతిపాదనలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అన్నారు. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరిస్తామని అన్నారు.
ఇక రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర మత సంబంధిత భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు పవర్ కేటగిరిని మార్చాలని రిక్వెస్ట్ చేస్తున్నాయని.. వాటిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కోల్ ధరలు పెరిగినందున ఎనర్జీ అడ్జస్ట్‌మెంట్ చార్జీలను పెంచుకోవడానికి అనుమతి కోరగా.. 30 పైసల వరకు చార్జీలు పెంచడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే.. ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.