Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నికలో ఓటమిని ముందే ఒప్పేసుకున్న బీజేపీ!

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఉపఎన్నిక గెలుపు ఆయన భుజాల మీదే వేసిన రాష్ట్ర నాయకత్వం.. కనీసం ప్రచారానికి కూడా రావడం లేదు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతే ఎవరు దాని బాధ్యత తీసుకునే పరిస్థితి కూడా లేదు.

మునుగోడు ఉపఎన్నికలో ఓటమిని ముందే ఒప్పేసుకున్న బీజేపీ!
X

- అందుబాటులో లేని బండి సంజయ్, కిషన్ రెడ్డి

- ఇరకాటంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నిన్న, మొన్నటి వరకు మునుగోడు ఉపఎన్నికలో గెలుపు నాదే అని బీరాలు పలికిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు డైలమాలో పడ్డారు. రాజీనామా చేసిన దగ్గర నుంచి ఒంటి చేత్తో గెలుస్తానని ధీమాగా ఉన్న రాజగోపాల్ ధైర్యం క్రమంగా సడలుతున్నట్లే కనపడుతోంది. ఇందుకు ముఖ్య కారణం రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి సరైన సహకారం లేకపోవడమే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను నియోజకవర్గంలో మోహరించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున కూడా రేవంత్ రెడ్డి రెండు, మూడు రోజులుగా మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ, బీజేపీ తరపున రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక్కరు కూడా రాజగోపాల్ వెంట ఉండటం లేదు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఉపఎన్నిక గెలుపు ఆయన భుజాల మీదే వేసిన రాష్ట్ర నాయకత్వం.. కనీసం ప్రచారానికి కూడా రావడం లేదు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతే ఎవరు దాని బాధ్యత తీసుకునే పరిస్థితి కూడా లేదు. బండి సంజయ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లిపోయారు. తన పాదయాత్రను కొనసాగించడానికి అధిష్టానాన్ని ఒప్పించడానికే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తున్నది. పాదయాత్ర కంటిన్యూ చేస్తే కానీ.. తన స్టేట్ చీఫ్ పదవికి రక్షణ ఉండదని బండి సంజయ్ మదనపడుతున్నారు. దీంతో ఆయన మునుగోడు ప్రచారంలో కనిపించడం లేదు. ఇక బీజేపీలో చేరిన దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేసిన ఈటల రాజేందర్ కూడా తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. మునుగోడులో గెలుపు కంటే ఆయన పార్టీ పదవి దక్కించుకోవడం పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనపడుతున్నది.

ఇక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాలుకు ఫ్రాక్చర్ కావడంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలా పార్టీలోని పెద్దలంతా మునుగోడుకు మొఖం చాటేశారు. సీనియర్ నాయకులు ఉపఎన్నిక కాడిని వదిలేశారని.. అక్కడ ఎంత ప్రయత్నించినా గెలవడం కష్టమనే నిర్ణయానికి రావడంతోనే పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టు కూడా ప్రకటించలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఒంటరిగా ప్రచారానికి వెళ్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలవడం అంత సులభమేమీ కాదని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించిన నేపథ్యంలోనే సీనియర్ నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నట్లు వ్యాఖ్యలు వస్తున్నాయి.

మునుగోడులో ఎప్పటి నుంచో బీజేపీకి అండగా ఉన్న కార్యకర్తలు కూడా పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీకి అంతా తామై పని పని చేస్తుండగా.. అకస్మాతుగా రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి తమపై ఆధిపత్యం చెలాయించడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. కోమటిరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత అప్పటి వరకు బీజేపీకి నమ్మకస్తులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టారు. దీంతో వీళ్లంతా ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పైగా రాజగోపాల్ రెడ్డి అనుచరులు తమపై చూపిస్తున్న ఆధిపత్యాన్ని వాట్సప్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తల ఆవేదన కూడా ఇప్పుడు మునుగోడులో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

రాజగోపాల్ రెడ్డి రాకతో అసంతృప్తితో ఉన్న చాలా మంది బీజేపీ కింది శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. తాము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా సీనియర్ నాయకులు ఎవరూ తమతో చర్చించడానికి కూడా ముందుకు రావడం లేదని.. తమకు ప్రాధాన్యత లేని చోట ఎందుకు ఉండాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తామంతా త్వరలోనే టీఆర్ఎస్‌లోకి వెళ్తామని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న పరిణామాలు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. ఉపఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని తొలుత భావించిన రాజగోపాల్.. రాష్ట్ర నాయకత్వం నుంచి లేని సపోర్ట్, స్థానిక బీజేపీ క్యాడర్ తిరుగుబాటు ఇబ్బందులకు గురి చేస్తోంది. పైకి గెలుస్తాననే ధీమా ప్రకటిస్తున్నా.. మనసులో మాత్రం ఓటమి భయం వెంటాడుతున్నట్లే కనపడుతోంది.

First Published:  14 Oct 2022 8:21 PM IST
Next Story