Telugu Global
Telangana

'మునుగోడు ఉపఎన్నికలో ఏ అభ్యర్థి కూడా రూ. 40 లక్షలు ఖర్చు చేయలేదు'

ఉపఎన్నిక బరిలో నిలిచిన ఏ అభ్యర్థి కూడా రూ. 40 లక్షల ఖర్చును మించలేదని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో ఏ అభ్యర్థి కూడా రూ. 40 లక్షలు ఖర్చు చేయలేదు
X

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి నవంబర్‌లో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఈ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. కోమటిరెడ్డి ఈ ఎన్నికలో గెలవడానికి భారీగా డబ్బు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరిగింది. మద్యం, డబ్బు ఏరులై పారినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అన్ని పార్టీలు కలిపి ఒక్కో ఓటరుకు దాదాపు రూ.10 వేల వరకు తాయిలాలు ఇచ్చినట్లు స్థానికంగా చర్చ జరిగింది.

ఇటీవల కాలంలో అత్యంత భారీ ఖర్చుతో జరిగిన ఉపఎన్నిక ఇదే అనే వార్తల నేపథ్యంలో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ఏ అభ్యర్థి కూడా రూ. 40 లక్షల ఖర్చును మించలేదని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఉపఎన్నికలో ఒక్కో అభ్యర్థి రూ. 40 లక్షల వరకు ఖర్చు చేసుకునే వెసులు బాటును కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. కానీ, ఈసీఐ ఇచ్చిన పరిమితిని ఎవరూ చేరుకోలేదని అధికారులు నివేదిక సమర్పించారు.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధికంగా రూ. 34.75 లక్షలు ఖర్చు చేశారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రూ. 28.96 లక్షలు, టీఆర్ఎస్ క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రూ.26.12 లక్షలు ఖర్చు పెట్టినట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కేఏ పాల్ అత్యధికంగా రూ.6.79 లక్షలు ఖర్చు చేశారు.

ఇక గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ పార్టీల్లో బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి రూ.13,11,500, తెలంగాణ జన సమితి అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ రూ.5,58,483.. యుగతులసి పార్టీ అభ్యర్థి కే. శివకుమార్ రూ. 3,21,200, ప్రజా స్రవంతి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు రూ.1,35,768 మేరక ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నిక బరిలో 47 మంది నిలవగా.. కేవలం 13 మంది మాత్రమే రూ. 1 లక్ష కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్లు నివేదిక తెలిజేస్తోంది. ఇక 11 మంది అభ్యర్థులు రూ. 5వేల నుంచి రూ. 10వేల మధ్యే ఖర్చు చేయడం గమనార్హం.

First Published:  16 Dec 2022 7:02 AM IST
Next Story