Telugu Global
Telangana

ఎవరెన్ని మాటలు చెప్పినా.. బీఆర్ఎస్‌దే హ్యాట్రిక్ విజయం : మంత్రి హరీశ్ రావు

గజ్వేల్ ఇప్పుడు రిజర్వాయర్లకు, చదువులకు నిలయంగా మారింది. కేసీఆర్ కట్టిన బంగ్లాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నం కూడా వేయలేరు.

ఎవరెన్ని మాటలు చెప్పినా.. బీఆర్ఎస్‌దే హ్యాట్రిక్ విజయం : మంత్రి హరీశ్ రావు
X

పార్లమెంట్, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఆ పార్టీకి గతమే తప్ప భవిష్యత్‌ లేదు. కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తామని బీరాలు పలుకుతున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా.. బీఆర్ఎస్ పార్టీ మూడో సారి విజయం సాధిస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ రికార్డు సాధిస్తారని వైద్యోరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కల్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ వల్లే ఆనాటి గతుకుల గజ్వేల్.. ఇవ్వాళ బతుకుల గజ్వేల్‌గా మారింది. గజ్వేల్‌లో ఉన్న నలుగురు కాంగ్రెస్ నాయకులు టికెట్ కోసం తన్నుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గజ్వేల్ ముఖ చిత్రమే మారిపోయింది. సీఎం కేసీఆర్ వల్లే ఇదంతా సాధ్యమయ్యిందని మంత్రి చెప్పారు. రూ.1,200 కోట్లతో త్వరలోనే ములుగు మండలంలో కొకోకోలా కంపెనీ రాబోతోందని చెప్పారు.

గజ్వేల్ ఇప్పుడు రిజర్వాయర్లకు, చదువులకు నిలయంగా మారింది. కేసీఆర్ కట్టిన బంగ్లాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నం కూడా వేయలేరు. తెలంగాణపై ఎంతో మంది అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆనాడు తెలంగాణ వస్తే రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని మాట్లాడిన వాళ్లే.. ఈ రోజు పొగుడుతున్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని చంద్రబాబే అంటున్నారు. కేసీఆర్ వల్లే ఇంత అభివృద్ధి జరిగిందని మంత్రి అన్నారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగింది. ఎవరూ ఊహించనంత మార్పు కనపడుతున్నది. అందుకే రాష్ట్రంలో మరో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మెదక్ జిల్లాలో డిపాజిట్ తెచ్చుకునే నాయకుడే ప్రతిపక్షంలో లేడు. బీజేపీ వాళ్లేమో మందికి పిట్టిన పిల్లలు మాకే పుట్టారని చెప్పుకొని తిరుగుతుంటారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

First Published:  11 Aug 2023 6:21 PM IST
Next Story