సరిలేరు కేసీఆర్ కి ఎవరూ - కవిత
కష్టంతో, కోపంతో, ఆవేదనతో , ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు కవిత. గత 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపెట్టిందన్నారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యం అని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశంలో ఎవరూ చేయనన్ని మంచి పనుల్ని సీఎంగా కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడంలో కేసీఆర్ కి ఎవరూ సరిలేరన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి సహా పలువురు స్థానిక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సాయం చేసిన రోజే తమ పార్టీ నాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. నాయకులు, కార్యకర్తల త్యాగ ఫలమే.. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న పథకాలని వివరించారు కవిత. కార్యకర్తల స్వేదమే చెరువుల్లో మంచినీరుగా కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగమే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో ఫలితాలనిస్తోందని చెప్పారు.
కష్టంతో, కోపంతో, ఆవేదనతో , ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు కవిత. గత 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపెట్టిందన్నారు. ఇకపై మరింత బాధ్యతగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రెండు దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు మన పార్టీకి బలం అని చెప్పారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నదే తమ మొదటి ఉద్దేశమని చెప్పారు. పార్టీలో ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని హామీ ఇచ్చారు.