Telugu Global
Telangana

దసరా సెలవులు తగ్గించాలన్నఎస్సీఈఆర్టీ... తగ్గేదేలేదన్న తెలంగాణ సర్కార్

దసరాసెలవులను తగ్గించాలన్న SCERT సూచనను తెలంగాణ సర్కార్ తోసిపుచ్చింది. గతంలో ప్రకటించినట్టు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

దసరా సెలవులు తగ్గించాలన్నఎస్సీఈఆర్టీ... తగ్గేదేలేదన్న తెలంగాణ సర్కార్
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సెలవులను తగ్గించాలని, 1వ తేదీ నుంచి సెలవులు ఇవ్వాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

భారీ వర్షాల కారణంగా జూలై 11 నుంచి 16 వరకూ వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా సెప్టెంబరు 17న ప్రత్యేక సెలవులను ప్రకటించడంతో అకడమిక్‌ క్యాలెండర్‌లో 8 రోజులు తగ్గాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి వీలుగా స్కూళ్లకు దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో దసరా సెలవులు తగ్గుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో సెలవులు తగ్గించే ప్రసక్తే లేదని పాఠశాల విద్యా శాఖ ఈ రోజు ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని, అక్టోబ‌ర్ 10న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అవుతాయ‌ని తెలిపింది.


First Published:  21 Sept 2022 3:54 PM IST
Next Story