Telugu Global
Telangana

వరికి రూ.500 బోనస్‌ లేనట్లే.. కాంగ్రెస్‌ మరో మోసం..!

ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతోందని.. అందువల్లే బోనస్ ఇవ్వట్లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి.

వరికి రూ.500 బోనస్‌ లేనట్లే.. కాంగ్రెస్‌ మరో మోసం..!
X

ఆరు గ్యారంటీ ఇచ్చి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌.. వంద‌రోజుల పాల‌న కూడా పూర్తికాక‌ముందే మరో హామీపై చేతులెత్తేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే వరికి ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆరు గ్యారంటీల్లోనూ రైతుభరోసా విభాగంలో ఈ హామీని పెట్టింది. అయితే ఇటీవల ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ.. ఈ హామీని అమల్లోకి తీసుకురాలేదు ప్రభుత్వం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ హామీపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.


తాజాగా ఈ హామీపై మెలిక పెట్టింది కాంగ్రెస్. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతోందని.. అందువల్లే బోనస్ ఇవ్వట్లేదన్నారు కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ప్రస్తుతం ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయనప్పటికీ.. ఓపెన్ మార్కెట్‌లోనే ధాన్యం క్వింటా రూ.2600 పలుకుతోందన్నారు. మద్దతు ధర కంటే ఇది దాదాపు రూ. 500 ఎక్కువ అన్నారు.


ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ ధర పలికినప్పుడు మాత్రమే బోనస్ ఇస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పారు కోదండరెడ్డి. కాగా.. ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలోనూ కాంగ్రెస్ యూ-టర్న్ తీసుకుంది. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీలతోనూ పలు సభల్లో ఈ మాట చెప్పించింది. కానీ, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే నిరుద్యోగ భృతి హామీ తామివ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దాటవేశారు.

First Published:  13 Feb 2024 10:49 AM IST
Next Story