Telugu Global
Telangana

2024 ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో పొత్తు ఉంటుందనే చర్చ ఊహ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.

No pre-poll alliance with any party in 2024 elections: Telangana minister KTR
X

2024 ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తప్పకుండా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి బీజేపీయేతర పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమని పలువురు వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఊహాగానాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్ పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో పొత్తు ఉంటుందనే చర్చ ఊహ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఒక జాతీయ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పుడు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ తమ ఉనికిని, బలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలతో కలిసి ఎన్నికలకు ముందుగానే పొత్తు పెట్టుకోవాలని ఆలోచించడం సరైన నిర్ణయం కాదని కేటీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున బీఆర్ఎస్ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ముందుగా ఫోకస్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మేం జాతీయ స్థాయిలో ప్రభావితం చేయడానికి ఈ నాలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలు ప్రస్తుతానికి సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ అవసరం అయితే ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచించే అవకాశం ఉందని కేటీఆర్ వెల్లడించారు.

వివిధ రకాలైన భావజాలాలు, వైవిధ్యమైన రాజకీయ నేపథ్యాలు కలిగిన నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొని రావడం క్లిష్టమైన సవాలు. ఇప్పటికే అనేక మంది ఇతర పార్టీల నేతలు, నాయకులతో పలు మార్లు చర్చలు జరిపిన తర్వాత సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. ప్రతీ ప్రాంతీయ పార్టీకి తమ సొంత అజెండాలు, సవాళ్లు ఉన్నాయి. ప్రతీ రాష్ట్రంలో వారి సమస్యలు వారికి ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌నే తీసుకుంటే.. మమత బెనర్జీకి అక్కడ బీజేపీనే ఏకైక శతృవు. దీంతో ఆమె ఆ పార్టీపైనే ఫోకస్ ఎక్కువ చేయాల్సి ఉంటుందన్నారు.

ఇక తెలంగాణలో బీజేపీకి అసలు స్థానమే లేదు. మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే వస్తుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్, టీఎంసీ పొత్తు పెట్టుకొని కలిసి చేసే పోరాటం ఏముంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. అసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఎవరు మాత్రం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 28, ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికిప్పుడు మేం చేయాల్సిన పని చాలా ఉంది. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికే ప్రస్తుతం పరిమితం అయ్యామని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు వెళ్లి ఏ నాగాలాండ్‌లోనో, మీజోరాంలోనే మేం చేసే పని ఏముంది.. అందుకే పొరుగు రాష్ట్రాలపై మా దృష్టి పెట్టాము. భవిష్యత్‌లో దేశమంతా విస్తరిస్తామని కేటీఆర్ చెప్పారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి మంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే నాందేడ్, కందార్ లోహలో ఏర్పాటు చేసిన సభలు విజయవంతం అయ్యాయి. త్వరలో ఔరంగాబాద్‌లో కూడా భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న.. ఒకప్పటి హైదరాబాద్ స్టేట్‌లో ప్రాంతాలపై బీఆర్ఎస్ ఎక్కువ దృష్టి పెట్టిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రభావితం అవుతున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అక్కడి ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా రైతులను ఆకట్టుకుంటోందని చెప్పారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని కేటీఆర్ తెలిపారు.

First Published:  19 April 2023 7:08 AM IST
Next Story