Telugu Global
Telangana

కవిత సాయం.. ఖతర్ జైలునుంచి నిజామాబాద్ మహిళలకు విముక్తి

ఎంబసీ అధికారులతో మాట్లాడి విమాన టికెట్లు కూడా వారికి మంజూరయ్యేలా చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆమె చొరవతో వారిద్దరూ నిజామాబాద్ కి చేరుకున్నారు.

కవిత సాయం.. ఖతర్ జైలునుంచి నిజామాబాద్ మహిళలకు విముక్తి
X

నిజామాబాద్ మహిళలు ఖతర్ జైలులో చిక్కుకున్నారు. ఉపాధికోసం వెళ్లి మోసగాళ్ల మాయలో పడి చివరకు జైలుకెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కవిత చొరవ తీసుకుని వారిని విడిపించారు. తిరిగి స్వగ్రామానికి చేర్పించారు. నిజామాబాద్ కి తిరిగొచ్చిన ఇద్దరు మహిళలు ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. కృతజ్ఞతలు తెలిపారు.

అసలేం జరిగిందంటే..?

నిజామాబాద్ కి చెందిన ఆసియా బేగం, షేక్‌ నసీమా.. 10 నెలల క్రితం బతుకుదెరువు కోసం ఖతర్‌ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి జీతం ఇవ్వలేదు, అదేమని అడిగితే వేధింపులు మొదలయ్యాయి. యజమానులు కొట్టారు, తిట్టారు, శారీరకంగా హింసించారు. దీంతో బాధితులిద్దరూ అక్కడినుంచి పారిపోతూ పోలీసులకు చిక్కారు. ఇక్కడ మరో సమస్య మొదలైంది. వారికి సంబంధించిన పాస్ పోర్ట్, వీసా వారి వద్ద లేకపోవడంతో పోలీసులు ఇద్దరినీ జైలుకి పంపించారు. ఈ విషయం వారి బంధువుల ద్వారా ఎమ్మెల్సీ కవితకు తెలిసింది. వెంటనే ఆమె స్పందించారు. ఖతర్ లోని జాగృతి సంస్థ ప్రతినిధుల్ని అలర్ట్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

ఖతర్‌ లోని జాగృతి అధ్యక్షురాలు అబ్బగౌని నందిని వెంటనే స్పందించారు. జైలుకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి కేవలం 10 రోజుల్లో వారిద్దర్నీ జైలునుంచి విడుదలయ్యేలా చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఆమె సహకారంతోనే ఇంటికి చేరారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి విమాన టికెట్లు కూడా వారికి మంజూరయ్యేలా చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆమె చొరవతో వారిద్దరూ నిజామాబాద్ కి చేరుకున్నారు. నిజామాబాద్ చేరుకున్న తర్వాత కూడా జాగృతి సంస్థ ప్రతినిధులు వారిని సంప్రదించి, పరామర్శించారు. దేశం కాని దేశంలో జైలులో మగ్గిపోతున్న తమను ఆదుకున్న కవితకు బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  5 Nov 2022 7:02 PM IST
Next Story