Telugu Global
Telangana

తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను కప్పిపుచ్చేందుకే నిర్మలా సీతారామన్ ప్రయత్నం

అమృత్‌కాల్ బడ్జెట్‌పై దూరదర్శన్ డైలాగ్‌లో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పట్ల బిజెపి ప్రభుత్వ వివక్షను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన సమస్యలపై కొన్ని సత్యదూర‌ వివరణలు ఇచ్చారు.

తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను కప్పిపుచ్చేందుకే నిర్మలా సీతారామన్ ప్రయత్నం
X

కేంద్ర బడ్జెట్‌పై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమానికి భరోసానిచ్చే అత్యుత్తమ బడ్జెట్ అని పేర్కొన్నారు.

అమృత్‌కాల్ బడ్జెట్‌పై దూరదర్శన్ డైలాగ్‌లో మాట్లాడిన ఆర్థిక మంత్రి తెలంగాణ పట్ల బిజెపి ప్రభుత్వ వివక్షను కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన సమస్యలపై కొన్ని సత్యదూర‌ వివరణలు ఇచ్చారు.

మోడీ సర్కార్ ప్రచారం చేస్తున్న ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ డొల్ల తనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఎంతో కాలంగా ఐదు ట్రిలియన్ డాలర్లంటూ ప్రచారం చేస్తున్నారు కానీ భారతదేశం ఇప్పటికీ 3.5 ట్రిలియన్ డాలర్లను దాటడం లేదని కేసీఆర్ అన్నారు.

దీనిపై నిర్మలా సీతారామన్ , ఇది దేశ ప్రజలను విమర్శించడమే కాదు అవమానించడం కూడా. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే దేశ లక్ష్యానికి ప్రతి రాష్ట్రం సహకరించడానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణ కూడా సహకరించాలి అన్నారు.

వాస్తవం: 2022 నాటికి భారతదేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చాలా కాలం క్రితమే ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ భారతదేశం ఇప్పటికీ 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ మోడీ సర్కార్ తన గడువును పొడిగించి 2024-25 నాటికి భారతదేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తాజాగా ప్రచారం మొదలుపెట్టింది. ఇలా తాను పెట్టిన గడువులనే అది పదే పదే మార్చడం, దాన్ని ఒక జోక్ గా మార్చడంపై విమర్శలు వస్తే ఆగ్రహం ఎందుకో ?

2014-15తో పోలిస్తే ఇప్పుడు, దేశ జిఎస్‌డిపిలో తెలంగాణ సహకారం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగి 165 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశానికి తెలంగాణ సహకారం 4.1 శాతం నుండి 4.9 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయం కూడా పెరిగింది. తెలంగాణ సాధించిన అభివృద్ది వేగంతో దేశం పురోగమించి ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.15 లక్షల కోట్లుగా ఉండేది అని కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. ఈ సమస్యలను బైటపెట్టే ప్రయత్నం చేస్తే నిర్మలా సీతారామన్ భావోద్వేగంగా స్పందించడంలో అర్దం ఏంటి ?

పన్ను పంపిణీపై

సిఎం కెసిఆర్: తెలంగాణ రాష్ట్రం కేంద్రం నుంచి పొందుతున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తోంది అన్నారు.

నిర్మల‌: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించిన దానికంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చాలా ఎక్కువ ఇచ్చింది అని చెప్పారు.

వాస్తవం: కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.68 లక్షల కోట్లు చెల్లించింది. అయితే తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.1.39 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.1.30 లక్షల కోట్లు చెల్లించామని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అందుకోవాల్సిన రూ.40,000 కోట్ల మొత్తాన్ని కూడా ఇందులో చేర్చారు. అయినప్పటికీ తెలంగాణ కేంద్రానికి ఇచ్చిన దానితో సమానం కాదు.

అదేవిధంగా, రైల్వే లైన్ల కోసం, రూ.7,000 కోట్లు కేటాయింపులు జరిగాయి. వీటిలో రూ.4000 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి. కేంద్ర ఆర్థిక మంత్రి క్లెయిమ్ చేసిన మొత్తం రూ.2.76 లక్షల కోట్లలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయించబోయేవి దాదాపు రూ.40,000 కోట్లు.

పెరుగుతున్న అప్పులపై

సీఎం కేసీఆర్: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశ అప్పులు గణనీయంగా పెరిగాయి అని విమర్శించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి దానికి జవాబు చెప్పకుండా తెలంగాణపై దాడికి దిగారు. తెలంగాణ అప్పులు 2014లో రూ.60,000 కోట్లు ఉండగా 2023 నాటికి రూ.3 లక్షల కోట్లకు పెరిగాయని విమర్శించారామె..

వాస్తవం: 2023-24 యూనియన్ బడ్జెట్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే, గత 10 సంవత్సరాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశ‌ అప్పులు రూ.112 లక్షల కోట్లు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సెకనుకు రూ.5.34 లక్షల అప్పులు తెచ్చే అవకాశం ఉంది. 10 ఏళ్లలో అప్పులు 170 శాతం పెరిగాయి. అప్పులపై కేంద్రప్రభుత్వం చెల్లించే వార్షిక వడ్డీ ఎనిమిది లక్షల కోట్లు.

FRBM నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ అప్పులు GDPలో 40 శాతానికి మించకూడదు. అయితే అది 56.2 శాతానికి పెరిగింది.

ఈ కఠిన వాస్తవాలన్నింటినీ పరిశీలిస్తే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేంద్రం చేస్తున్న అప్పులపై కనీసపట్టింపులేదు. కానీ తెలంగాణ అప్పుల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు, రాష్ట్ర GSDPలో తెలంగాణ అప్పులు 27.4 శాతంగా ఉన్నాయి. ఇది 10 పెద్ద రాష్ట్రాలలో ఐదవ స్థానం. పంజాబ్ 48.4 శాతంతో ముందంజలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా తెలంగాణ కంటే దారుణంగా ఉన్నాయి.

First Published:  17 Feb 2023 5:50 AM GMT
Next Story