నిర్మల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత..
ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోతాయి, ప్రచారం ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఈ కాస్త సమయంలోనే హడావిడి జోరుగా సాగుతోంది. ప్రశాంతంగా జరగాల్సిన ప్రచారం కాస్తా చివరి దశకు చేరుకున్నాక ఉద్రిక్తంగా మారుతోంది. తాజాగా నిర్మల్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్న ప్రాంతంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. సడన్ గా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నేతలు అక్కడ నిరసన చేపట్టారు.
ప్రచారం చివరి దశకు చేరుకోగానే చాలా చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతి దాడులు జరిగే అవకాశముండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలీస్ బలగాలు తెలంగాణకు రాలేదు. ఈసారి ఎన్నికలకు పెద్ద ఎత్తున బలగాలను రప్పించారు. అయినా కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.