రైతుబంధు ఎంత మందికి ఇచ్చారు.. ప్రభుత్వానికి నిరంజన్ రెడ్డి ప్రశ్న..!
రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంటే మేధావులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. బియ్యం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి పోయాయన్నారు.
దేశంలో రైతులను హోల్ సేల్ గా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ ఏం అయ్యిందో చెప్పాలన్నారు. ఏ రోజు ఎంత మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వివరాలు ఎందుకు విడుదల చేయడం లేదన్నారు నిరంజన్ రెడ్డి. రైతు బంధు సాయం మొదలు పెట్టి 27 రోజులు గడిచినా.. ఎకరా రైతుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కాలేదన్నారు.
రాష్ట్రంలో ఎంత మంది రైతుల దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేసి బోనస్ క్వింటాకి రూ.500 ఇచ్చారో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 నాటికే రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న రైతు బంధు నిధులు ఏం అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు విషయంలో బీఆర్ఎస్ పారదర్శకంగా వ్యవహరించిందని వివరించారు.
రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంటే మేధావులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. బియ్యం, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి పోయాయన్నారు. ఇప్పటికైనా మేధావులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.