Telugu Global
Telangana

కొత్త మెడికల్ కాలేజీల్లో.. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎన్ఎంసీ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

కొత్త మెడికల్ కాలేజీల్లో.. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు
X

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్లా, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో విద్యార్థుకు ఈ ఏడాది అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటిలో మూడు మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు పూర్తయ్యాయి. మిగిలిన కాలేజీలకు సంబంధించిన తనిఖీలు వారం, పది రోజుల్లో పూర్తి కానున్నాయి.

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎన్ఎంసీ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇన్‌స్పెక్షన్‌కు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన కళాశాలలకు కూడా ఎన్ఎంసీ అప్రూవల్ లభించేలా చూడాలని కోరారు. ఎన్ఎంసీ నిబంధనలు అన్నీ పాటించేలా.. ఎలాంటి లోటు పాట్లు లేకుండా కాలేజీలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని పెండింగ్ వర్క్స్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

9 కళాశాలల్లో ఎలాంటి పనులు ఆగకుండా.. ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చి నియమించినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే మరో 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను కౌన్సిలింగ్ ద్వారా ఈ 9 కాలేజీల్లో నియమిస్తామని, వారంలోపే వారి నియామకం పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. లిస్టు వచ్చిన తర్వాత ఫైనల్ అపాయింట్‌మెంట్లు 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

9 మెడికల్ కాలేజీల్లో అవసరమైన సౌకర్యాలు అన్నీ కల్పించాలని.. హాస్టల్ వసతితో పాటు ఫర్మీచర్, పరికరాలు ఎలాంటి ఆలస్యం లేకుండా సమకూర్చాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ కాలేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్స్‌ను వెంటనే క్లియర్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామక్రిష్ణారావుకు మంత్రి సూచించారు. ఈ 9 కాలేజీలు ప్రారంభమైతే రాష్ట్రంలో మొత్తం మెడికల్ కళాశాలల సంఖ్య 26కు చేరుతుందని.. అలాగే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690కి చేరుతుందని చెప్పారు.

First Published:  26 March 2023 7:34 AM IST
Next Story