24 గంటల్లో 4 కిడ్నీ ఆపరేషన్లు.. నిమ్స్ వైద్యులపై ప్రశంసల జల్లు..
తొలిసారిగా నిమ్స్ లో ఒకేరోజు 4 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి శెహబాష్ అనిపించుకున్నారు వైద్యులు. నాలుగు ఆపరేషన్లు కూడా పూర్తిగా విజయవంతం అయ్యాయి.
తెలంగాణ ఆస్పత్రుల ఘనతను మరోసారి చాటి చెప్పింది నిమ్స్. ఒకేసారి నలుగురు బాధితులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు నిమ్స్ వైద్యులు. 18 మంది వైద్యులు, వారి సిబ్బంది.. 24 గంటలకు పైగా కష్టపడి క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సలు పూర్తిచేశారు.
ఈ ఆపరేషన్లు నిమ్స్ చరిత్రలో ఒక రికార్డుగా వైద్యులు పేర్కొంటున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా నిమ్స్ వైద్యుల కృషిని అభినందించారు. వాట్ ఎ గుడ్ న్యూస్ అంటూ ఆయన ఈ వార్తను ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అద్భుతమైన సేవలు అందుతున్నాయని చెప్పారు కేటీఆర్. వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
What a beautiful news
— KTR (@KTRTRS) December 22, 2022
Doctors at NIMS, Hyderabad have performed 4 kidney transplantations within 24 hours
Telangana Govt hospitals have been delivering terrific valued services to the patients. My compliments to all the staff pic.twitter.com/UF0tIKXPAz
ఎలా సాధ్యమైంది..?
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైనది. అందులోనూ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే దానికి తగిన సౌకర్యాలుంటాయి. కానీ తొలిసారిగా నిమ్స్ లో ఒకేరోజు 4 ఆపరేషన్లు చేసి శెహబాష్ అనిపించుకున్నారు వైద్యులు. నాలుగు ఆపరేషన్లు కూడా పూర్తిగా విజయవంతం అయ్యాయి. మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ ఈసీఐఎల్, హైదరాబాద్ ఐడీపీఎల్ కు చెందిన నలుగురు బాధితులు కొన్నాళ్లుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నలుగురూ జీవన్ దాన్ లో దరఖాస్తు చేసుకున్నారు. దాతలకోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ గా మారడంతో వారి కిడ్నీలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వీటి ద్వారా ముగ్గురికి ఆపరేషన్ చేయొచ్చని తేల్చారు వైద్యులు. నాలుగో బాధితురాలు వెంకట లక్ష్మికి ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. దీంతో నాలుగు ఆపరేషన్లు ఒకేసారి మొదలు పెట్టారు.
ఈ నెల 19వతేదీ రాత్రి ఆపరేషన్లు మొదలు పెట్టారు, 21వతేదీ తెల్లవారు ఝాము వరకు ఆపరేషన్లు కొనసాగాయి. నిమ్స్ యూరాలజీ ప్రొఫెసర్లు డా.రామ్ రెడ్డి, డా.రాహుల్ దేవ్ రాజ్ ఈ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఒక్కో ఆపరేషన్ కి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని చెప్పారు వైద్యులు. అన్ని ఆపరేషన్లు విజయవంతమయ్యాయని, నలుగురికి పునర్జన్మ లభించడం సంతోషంగా ఉందన్నారు నిమ్స్ అధికారులు.
ఉచితంగా ఆపరేషన్లు..
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని, ఒక్కో ఆపరేషన్ కి ప్రైవేట్ ఆస్పత్రిలో 10 లక్షలనుంచి 15 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకుంటారు. కానీ నిమ్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా ఆపరేషన్లు చేశారు. నిమ్స్ ఆస్పత్రి వైద్యులు సాధించిన ఈ ఘనతపై ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో నిమ్స్ వైద్యులను అభినందిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.