కామన్వెల్త్ లో మెరిసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.. బాక్సింగ్ లో గోల్డ్ మెడల్
తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఉత్తర ఐర్లాండుకు చెందిన కార్లీ మెక్ నౌల్ ని 5-0 తో ఓడించింది నిఖత్
బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో తెలంగాణ తేజం మెరిసింది. బాక్సింగ్ లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. ఐర్లాండ్ కి చెందిన బాక్సర్ కార్లీ మెక్ నౌల్ ని 5-0 తో ఓడించి సత్తా చాటింది. 48-50 కేజీల విభాగంలో ఈ యువ బాక్సర్ చెలరేగిపోయి కార్లీని మట్టి కరిపించింది. మహిళల బాక్సింగ్ లో భారత్ కి మరో స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది. ఈ విభాగంలో భారత బాక్సర్లు అమిత్ పంఘాల్, నీతూ ఘంగాస్ స్వర్ణ పతకాలు సాధించి విజేతలయ్యారు. నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని సాధించడంతో బాక్సింగ్ విభాగంలో భారత్ సాధించిన బంగారు పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఉత్తర ఐర్లాండుకు చెందిన నౌల్.. ఏ దశలోనూ నిఖత్ కి గట్టి పోటీనివ్వలేకపోయింది. 45-48 కేజీల విభాగంలో నీతూ ఘంగాస్ కెనడాకు చెందిన ప్రియాంక ధిల్లాన్ ని ఓడించి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హౌస్ పాల్ పసిడి పతకం అందుకున్నాడు. ఇదే విభాగంలో అబ్దుల్లా అబూ బకర్ సిల్వర్, రేస్ వాక్ విభాగంలో సందీప్ కుమార్ కాంస్యం సాధించారు. ఈ గేమ్స్ లో ఇండియా ఇప్పటివరకు మొత్తం 48 మెడల్స్ సాధించగా వాటిలో 17 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
కామన్ వెల్త్ గేమ్స్ లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల సీఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. నిఖత్ మరోసారి విదేశాల్లో తెలంగాణ ప్రతిష్టను పెంచిందంటూ ఆమెను అభినందించారు. ఆమె గెలుపుతో మరోసారి తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్.. రెండు నెలల క్రితమే చరిత్ర సృష్టించింది. గత మే నెలలో ఇస్తాన్ బుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగం.. ఫైనల్ లో తన ప్రత్యర్థిని 5-0 తేడాతో ఓడించి విజయం సాధించింది. అప్పుడు కూడా స్వర్ణం ఈమె సొంతమైంది. ఇప్పుడు కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా ఈ యువ బాక్సర్ 5-0 తేడాతోనే తన ప్రత్యర్థి, ఐర్లాండ్ బాక్సర్ ని ఓడించడం విశేషం.