లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.

కొడంగల్ లగచర్ల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. పరిశీలన కోసం లగచర్లకు బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఫార్మాసిటీ స్థలసేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిర్వహించ తలపెట్టిన గ్రామసభ యుద్దాన్ని తలపించింది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.