రాహుల్ పప్పు కాదు.. పప్పా
రాహుల్ గాంధీ ఈసారి తప్పకుండా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు వీహెచ్. అలా కాని పక్షంలో తన పేరు మార్చుకుంటానన్నారు.
రాహుల్ ని పప్పు అంటూ కొంతమంది ఎగతాళి చేశారని, అలాంటి వారికి ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పా అయ్యారంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. రాహుల్ ని ఎగతాళి చేసినవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు వీహెచ్. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ BC నాయకుల సమావేశంలో పాల్గొన్న వీహెచ్.. ఇంకాస్త కష్టపడితే కాంగ్రెస్ తప్పకుండా తెలంగాణతోపాటు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవి సహజమే..
తెలంగాణ కాంగ్రెస్ లో చిన్న చిన్న కోపాలు, గొడవలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు వీహెచ్. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలున్నాయని.. సీనియర్లపై జూనియర్లు పెత్తనం చెలాయిస్తానంటే ఎవరూ ఊరుకోరని అన్నారు. తమ పార్టీలో లొల్లి ఇదేనని వివరించారు.
నా పేరు మార్చుకుంటా..
రాహుల్ గాంధీ ఈసారి తప్పకుండా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు వీహెచ్. అలా కాని పక్షంలో తన పేరు మార్చుకుంటానన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు వీహెచ్. అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని పార్లమెంట్ లో ప్రశ్నించినందుకు రాహుల్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఇతర పార్టీల్లో ఉంటే అవినీతిపరులు, బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులా? అని నిలదీశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ గర్జన పెడతామన్నారు వీహెచ్.
20 సాధించండి చాలు..
అగ్రకులాల వాళ్లు బీసీలను రాజకీయంగా ఎదగనీయడంలేదని, అణగదొక్కుతున్నారని ఆరోపించారు వీహెచ్. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, ముందు 20 శాతం సాధిస్తే చాలని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వాలనేది తన డిమాండ్ అని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదని, బీసీల హక్కులకోసమే తన పోరాటం అని చెప్పారు వి.హనుమంతరావు.