Telugu Global
Telangana

సెక్రటేరియట్‌ ముందు రాజీవ్ విగ్రహం వద్దు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ వార్నింగ్‌

అమరజ్యోతి ఇప్పటివరకూ పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదన్నారు కేటీఆర్. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలపై రుద్దడం సరికాదన్నారు

సెక్రటేరియట్‌ ముందు రాజీవ్ విగ్రహం వద్దు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ వార్నింగ్‌
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా తప్పుపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ వాళ్లు కోరిన చోటుకు రాజీవ్ విగ్రహాన్ని తరలిస్తామన్నారు. ఆ ప్లేసులో తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాలన్నారు. దశాబ్ధి ఉత్సవాల టైమ్‌లోనే సెక్రటేరియట్‌ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు కేటీఆర్.


తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కుసంస్కార పార్టీ అంటూ విమర్శలు గుప్పించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అన్నది లేదన్నారు. అంబేద్కర్ విగ్రహానికి దండేసింది లేదన్నారు. జయంతి నాడు కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం లైటింగ్ ఏర్పాటు చేయలేదన్నారు. అమరజ్యోతి ఇప్పటివరకూ పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదన్నారు కేటీఆర్. తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలపై రుద్దడం సరికాదన్నారు. పక్కనే గతంలో అంజయ్య పేరుతో పార్కు ఉంటే అది లుంబిని పార్కుగా మారిందని గుర్తు చేశారు.

గడిచిన పదేళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహరించామన్నారు కేటీఆర్. రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ రహదారి, బాసర ట్రిపుల్‌ ఐటీకి రాజీవ్ యూనివర్సిటీ, ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చలేదని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బాధతోనే చెప్తున్నామన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలనుకుంటే గాంధీ భవన్‌లో ఆయన విగ్రహం పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందన్నారు కేటీఆర్. మళ్లీ ఇవాళ క్రూర పరిహాసమాడే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజీవ్‌ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటమే అస్తిత్వ పోరాటమే అన్న కేటీఆర్.. అధికారంలోకి తిరిగివచ్చిన వెంటనే సెక్రటేరియట్ ముందు నుంచి విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. భవిష్యత్తులో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రాజీవ్ గాంధీ పేరును తొలగించి తెలంగాణ ప్రముఖుల పేరు పెడతామన్నారు కేటీఆర్. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, కర్ణాటకలో కెంపెగౌడ, ఒడిశాలో బిజూ పట్నాయక్ పేరుతో విమానాశ్రయాలున్నాయని గుర్తు చేశారు.

First Published:  19 Aug 2024 11:57 AM GMT
Next Story